గాలి జనార్థన్ రెడ్డి కేసు విచారణ 12 యేళ్లుగా జాప్యమా? సీబీఐ కోర్టు పై మండిపడ్డ సుప్రీం..

By Bukka SumabalaFirst Published Sep 15, 2022, 10:01 AM IST
Highlights

గాలి జనార్థన్ రెడ్డి కేసులో సీబీఐ కోర్టు 12 యేళ్లుగా విచారణను వేగవంతం చేయకపోవడం మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే దీనిమీద సీల్డ్ కవర్ నివేదిక అందించాలని ఆదేశించింది. 

ఢిల్లీ : గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్దన్ రెడ్డిపై సిబిఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ పన్నెండేళ్లుగా జాప్యం కావడాన్ని సహించలేమని వ్యాఖ్యానించింది. తాము గతంలో ఆదేశించినా విచారణలో జాప్యం ఎందుకు జరిగింది? విచారణ ఏ దశలో ఉందో?  చెప్పాలంది. ఏ కారణాల చేత  విచారణ ముందుకు సాగడం లేదో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాదులోని సీబీఐ కేసులో కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ స్పెషల్ బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది. 

గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై సిబిఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011  సెప్టెంబర్ 5న గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది.  కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని కడప, అనంతపూర్ జిల్లాలకు వెళ్ళొద్దని షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్న తన బెయిల్ షరతులను సడలించాలని జనార్దన్ రెడ్డి 2020లో మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

త‌ప్పుడు ప్ర‌చారాల‌తో శాంతిభ‌ద్ర‌త‌లు మెరుగుప‌డ‌వు.. యూపీ మైన‌ర్ సిస్ట‌ర్స్ ఘ‌ట‌న‌పై ప్రియాంక గాంధీ..

ముందుగా ఆయా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లకు తెలియజేసి బళ్ళారి, కడప, అనంతపురం వెళ్ళవచ్చు అంటూ గతేడాది ఆగస్టు 19న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో సీబీఐ అఫిడవిట్ వేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ను జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ క్రిష్ణ మురారితో కూడిన  ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.

ఆయన బళ్ళారిలో ఉంటే.. వారి ప్రాణాలకు ముప్పు..
సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్  మాధవి దివాన్ వాదనలు వినిపిస్తూ.. గాలి జనార్దన్ రెడ్డి స్వస్థలం బళ్లారి అని, ఆయన అక్కడ ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని, వారి ప్రాణాలకు ముప్పు ఉందని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎం.ఆర్.షా సీబీఐ కేసు విచారణ ఏ దశలో ఉందని ప్రశ్నించారు.  విచారణ సాగడం లేదని ఏఎస్ జి సమాధానమిచ్చారు. విచారణపై స్టే ఉందా.. అని  న్యాయమూర్తి ప్రశ్నించగా.. గతంలో అయితే లేదని ఏఎస్ జీ సమాధానమిచ్చారు. గతంలో  విషయం తాను అడగడం లేదని, ప్రస్తుతం ఉందా.. అని జస్టిస్ షా ప్రశ్నించారు. ఏఎస్ జీ వద్ద సరైన సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘తీవ్రమైన  అభియోగాలు ఉన్న ఈ వ్యవహారంలో కేసు నమోదైన 12 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సిబిఐ కేసుల న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట విచారణ సాగకపోవడం దురదృష్టకరం. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే. సుప్రీంకోర్టు 2021 ఆగస్టు 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో విచారణ వేగవంతానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సూచించింది. అయినా ఎటువంటి పురోగతి లేదు. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో విచారణ ఏ దశలో ఉంది. విచారణ సాగకపోవడానికి కారణాలు ఏమిటో తెలియజేస్తూ హైదరాబాద్ సీబీఐ కేసుల కోర్టు ప్రిన్సిపాల్ స్పెషల్ జడ్జి సీల్డ్ కవర్ నివేదిక అందజేయాలి. నివేదిక ఈనెల 19లోగా సుప్రీం కోర్టుకు చేరాలి. సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ కు పిటిషనర్లు రిజాయిండర్ దాఖలు చేయొచ్చు’ అని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

click me!