
బస్సు ఎక్కిన తర్వాత ఏ ప్రయాణికుడైనా డబ్బులిచ్చి టికెట్ తీసుకోవాల్సిందే. అయితే... ఈ టికెట్ డబ్బుల విషయంలో గొడవ జరిగి ఓ ప్రయాణికుడు.. కండక్టర్ ని దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ రాష్ట్రం భోపాల్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఎన్‌సిసి క్యాడెట్ అయిన ప్రయాణికుడు పోలీసు హెడ్‌క్వార్టర్స్ కోసం బోర్డు కార్యాలయం సమీపంలో బస్సు ఎక్కినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన మొత్తం బస్సులో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. నగరంలోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
25 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో యూనిఫాంలో ఉన్న బస్సు కండక్టర్ ఎన్‌సిసి క్యాడెట్ మధ్య ఛార్జీల గురించి వాగ్వాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికుడు టికెట్ ధర రూ.10 ఇవ్వగా.. రూ.15 ఇవ్వాలంటూ కండక్టర్ కోరాడు. టికెట్ ధర రూ.15 అని చెప్పినా.. అతను కేవలం రూ.10 ఇవ్వడానికి మాత్రమే అంగీకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రూ.5 కోసం ఇద్దరూ బస్సులో గొడవపడటం గమనార్హం.
కనీసం ఆ కండక్టర్ చెప్పేది కూడా సదరు ప్రయాణికుడు వినిపించుకోకపోవడం గమనార్హం. మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చిందని కండక్టర్ చెబుతున్నా వినిపించుకోకుండా దాడి చేశాడు. కండక్టర్ ని సీటులోకి నెట్టి.. దారుణంగా కొట్టడం వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. ఆ తర్వాత ప్రయాణికుడు తేరుకొని.. తాను దిగాల్సిన స్టాప్ వచ్చిందని కదులుతున్న బస్ నుంచే దిగి వెళ్లిపోయాడు. కాగా.. సదరు ప్రయాణికుడు చేసిన పనిని నెటిజన్లు సైతం విమర్శిస్తున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.