గాలి జనార్దన్ రెడ్డి ఎందుకు పార్టీ పెట్టారు? కర్ణాటక బీజేపీకి తలనొప్పేనా? కమల దళానికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటీ?

By Mahesh KFirst Published Dec 26, 2022, 6:54 PM IST
Highlights

బీజేపీ మాజీ నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమల దళంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, బీజేపీ డోర్స్ క్లోజ్ చేసింది. దీంతో ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఈ పార్టీతో ఇప్పుడు బీజేపీ కొత్త తలనొప్పి ఎదురవుతున్నది. ఇప్పటికే పలు సవాళ్లతో సతమతం అవుతున్న బసవరాజు బొమ్మై ప్రభుత్వం.. కొత్తగా గాలిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. గాలి పార్టీ బీజేపీ ఓట్లను చీల్చే అవకాశాలే ఎక్కువ. ఓట్లే కాదు.. నేతలనూ, ముఖ్యంగా బీజేపీ అసంతృప్తులను తనలోకి చేర్చుకునే అవకాశాలు ఎక్కువ.
 

బెంగళూరు: వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో బీజేపీ ఉన్నది. యెడియూరప్ప సీఎంగా దిగిపోయి ఆయన స్థానంలో బసవరాజు బొమ్మై బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అర్థంతరంగా సీఎం పదవి నుంచి వెళ్లిపోవడం అప్పట్లో పెద్ద చర్చను లేవదీసింది. అయితే, పార్టీ బలోపేతానికి, విజయానికి కష్టపడతానని ఆయన చెప్పారు. కానీ, యడియూరప్, బసవరాజు బొమ్మైల మధ్య దూరం పెరుగుతూనే ఉన్నది. బసవరాజు బొమ్మైకి ఇప్పటికే ఉన్న పలు సవాళ్లకు తోడు ఇప్పుడు కొత్తగా గాలి జనార్దన్ రెడ్డి రూపంలో ఎదురైంది.

మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మాజీ బీజేపీ నేత, మైనింగ్ బేరన్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. కళ్యాన రాజ్య ప్రగతి పక్ష పార్టీని ప్రకటించి బీజేపీకి సవాల్ విసిరారు. కొప్పల్ జిల్లా గంగావతి నుంచి ఆయన పోటీ చేయనున్నారు. గాలి జనార్దన్ రెడ్డి పార్టీతో బీజేపీకి తలనొప్పే ఎదురవనుందా? బీజేపీ తొలిసారి కర్ణాటకలో (దక్షిణ భారతంలోనే తొలిసారి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతో ఉపకరించిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీకి ప్రత్యర్థి ఎందుకు అయ్యారు? వంటి విషయాలు చూద్దాం..

కర్ణాటకలో రెడ్డి బ్రదర్స్‌గా ముద్రపడ్డ ముగ్గురు గాలి జనార్దన్ రెడ్డి, జీ కరుణాకర, జీ సోమశేఖరలలో జనార్దన్ రెడ్డి ఎక్కువ పాపులర్. ఆయన స్వల్పకాలంలోనే చాపర్‌లు కొనుగోలు చేసే బిజినెస్‌మ్యాన్‌గా, కర్ణాటకలో రాజకీయాలను ప్రభావితం చేసే నేతగా ఎదిగారు.

Also Read: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ.. ఇంతకీ ఆ పార్టీ పేరేంటీ?

2008లో బీజేపీ క్యాంపెయిన్‌కు రెడ్డి బ్రదర్స్ సహకరించారు. అప్పుడ యడియూరప్ప సారథ్యంలో తొలిసారి కర్ణాటకలో బీజేపీ అధికారంలోక వచ్చింది. క్యాబినెట్ బెర్తులు ఇచ్చినప్పటికీ వారు యడియూరప్పపై 2009లో తిరుగుబాటు చేశారు. బళ్లారి, తన మంత్రిత్వ శాఖల్లో అధికారుల నియామకాలపై తమకు స్వేచ్ఛ ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. అప్పుడు దాదాపు ప్రభుత్వాన్ని కూల్చేసినంత పని చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి ప్రకారం, అతనికి పార్టీతో సంబంధం లేదని 2018లో అమిత్ షా అన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే మొల్కల్మూరులో శ్రీరాములు గెలుపునకు సహకరించాలని గాలిని అమిత్ షా కోరారు. శ్రీరాములుకు క్యాంపెయిన్ చేశారు. శ్రీరాములు గెలిచాడు. ఆ తర్వాత ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే తనకు పార్టీలో పోస్టు ఇస్తానని షా హామీ ఇచ్చారు. కానీ, దానికి బదులు సీబీఐని ఇంటికి పంపారు.

సీబీఐ దాడులు, ఇతర అవమానాలు భరించి కూడా మళ్లీ పార్టీలోకి రానికి ప్రయత్నించారు. కానీ, పార్టీ సానుకూలంగా వ్యవహరించలేదు. దీంతో ఆగ్రహంతో తానే స్వయంగా పార్టీ స్థాపించారు.

బొమ్మై ప్రభుత్వంలో టెన్షన్ పెరుగుతున్నది. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీలో చాలా మంది నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఆయనకు బళ్లారి సహా కనీసం పది నియోజకవర్గాల్లో మంచి పలుకుబడి ఉన్నది. ఆయన బీజేపీ నేతలనే టార్గెట్ చేసుకుంటే.. పలువురు అందులోకి వలస వెళ్లే అవకాశాలు లేకపోలేవని బొమ్మై ప్రభుత్వంలో కలవరం మొదలైంది. తద్వార బీజేపీ ఓట్లకే గాలి గండిపెట్టే అవకాశాలు ఉన్నాయి. 

వీటికితోడు లింగాయత్ రిజర్వేషన్లు, అసంతృప్త నేతలు, క్యాబినెట్ విస్తరణపై అసంతృప్తు మంత్రులు, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం, యడియూరప్ప, బొమ్మైల మధ్య పెరిగిన దూరం వంటివి ఇప్పటికే బసవరాజు బొమ్మైకి సవాళ్లై కూర్చున్నాయి. వీటికితోడు కొత్తగా గాలి రూపంలో మరో సవాల్ ఎదురైంది.

గాలి పార్టీని బీజేపీ తక్కువ చేసి చూపే పనిలో ఉన్నది. గాలి జనార్దన్ రెడ్డి ఒకప్పుడు చాలా ఏరియాలను డామినేట్ చేశాడేమో.. కానీ, ఇప్పటికీ అతనికే ప్రాబల్యం ఉన్నదని అనుకోవడం ఇమ్మెచ్యూర్ అవుతుందని బీజేపీ పేర్కొంది.

click me!