రాముడంటే కాంగ్రెస్ కు ఇష్టం ఉండదు - బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా

By team teluguFirst Published Dec 26, 2022, 5:26 PM IST
Highlights

రాముడు అంటే కాంగ్రెస్ ఇష్టం ఉండదని, ఆ పార్టీ ఇప్పటికీ రాముడిపై తన వైఖరిని నిర్ణయించుకోలేదని బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా అన్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు కోసం విభజన రాజకీయాలకు పాల్పడిందని చెప్పారు. 

రాముడిని, సీతను బీజేపీ విభజించిందంటూ  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్పందించారు. శ్రీ రామచంద్రునిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా తన వైఖరిని నిర్ణయించుకోలేకపోయిందని ఆయన అన్నారు. రాముడి పట్ల అత్యంత విముఖత చూపేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. జై శ్రీరాం నినాదంపై ఎలాంటి చర్చ జరగలేదని పూనియా స్పష్టం చేశారు. 

రామజన్మభూమి ఆందోళన్ కు కాంగ్రెస్ వ్యతిరేకమని, ఓటు బ్యాంకు కోసం విభజన రాజకీయాలకు పాల్పడిందని సతీష్ పూనియా ఆరోపించారు. ‘‘జై శ్రీరామ్ నినాదానికి సంబంధించి ఎలాంటి చర్చ లేదు. ఎందుకంటే ఇది మన సనాతన సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తుంది’’ అని పూనియా అన్నారు.

పరీక్ష పేపర్ లీక్ కేసులో గెహ్లాట్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. చీటింగ్ మాఫియాను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందని ఆరోపించారు. ‘‘ గతంలో ఇలాంటి ఘటనలు జరిగేవి కావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం చీటింగ్ మాఫియాను పోషిస్తూ.. యువత కలలను అణగదొక్కడంలో పాలుపంచుకుంటోంది. ’’ అని ఆయన అన్నారు. 

అశోక్ గెహ్లాట్ ఏమన్నారంటే ? 
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ ‘జై శ్రీరామ్’ అని చెప్పడం వల్ల ప్రజల్లో భయం, కోపాన్ని కలిగిస్తోందని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సూచించినట్లు వారు (బీజేపీ) ‘జై సియారాం’ అని ఎందుకు అనరని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఆటలు ఆడుతోంది. ‘జై సియారాం’ అని అనాలని రాహుల్ గాంధీ సూచించినా ఎందుకు అనడం లేదు. దేశం మొత్తం సీతా మాతను గౌరవిస్తుంది. ‘జై శ్రీరామ్’ అంటూ ప్రజలను రెచ్చగొట్టి భయాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. వారు (బీజేపీ) రాముడు, సీతాదేవిని విభజించారు’’ అని అశోక్ గెహ్లాట్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.

ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. అందులో భాగంగా బగ్డి అనే గ్రామంలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ మహిళలను అణిచివేస్తోందని ఆరోపించారు. ఆ సంస్థకు మహిళా సభ్యులు లేకపోవడానికి అదే కారణమని పేర్కొన్నారు. ‘‘మీకు ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలు కనిపించరు. వారు మహిళలను అణచివేస్తారు. ఆ సంస్థలోకి వారిని అనుమతించరు.’’ అని తెలిపారు. ‘‘ నేను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని నాయకులను ఓ విషయం అడగాలని అనుకుంటున్నాను. మీరు జై శ్రీరామ్ అంటారు కానీ మీరు ఎందుకు జై సియారామ్ అని అనరు ? సీతామాతను ఎందుకు తొలగించారు ? మీరు ఆమెను ఎందుకు అవమానించారు ? మీరు భారతదేశంలోని మహిళలను ఎందుకు అవమానించారు ? ’’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. 

రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ అశోక్ గెహ్లాట్ నిన్న బీజేపీని కోరారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీపై పలు విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా నేడు బీజేపీ రాజస్థాన్ అధ్యక్షుడు సతీష్ పూనియా గెహ్లాట్ పై విరుచుకుపడ్డారు. 

click me!