G20 India 2023: జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాధినేత‌లు వీరే.. రానివారు ఎవ‌రంటే..?

Published : Sep 08, 2023, 02:09 PM ISTUpdated : Sep 08, 2023, 02:16 PM IST
G20 India 2023: జీ20 సదస్సుకు హాజరయ్యే ప్రపంచ దేశాధినేత‌లు వీరే.. రానివారు ఎవ‌రంటే..?

సారాంశం

G20 Summit Delhi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఇతర దేశాధినేతలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనంపై జీ-20 స‌మ్మిట్ లో చర్చించనున్నారు. అలాగే, రుణాలు, వాతావరణ మార్పు వంటి అభివృద్ధి అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. దౌత్యపరమైన సంక్లిష్టతలు ఉన్నప్పటికీ, ప్రపంచ వేదికపై తన స్థానాన్ని పదిలపరచుకోవడానికి భార‌త్ కు ఈ స‌ద‌స్సు అవ‌కాశం కల్పిస్తుంద‌ని చెప్పవచ్చు.

G20 Summit: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన నేతలు ఈ వారాంతంలో న్యూఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఇతర దేశాధినేతలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలపై చర్చించనున్నారు.  అయితే, ఈ స‌ద‌స్సుకు జీ-20 గ్రూప్ లోని ప‌లు దేశాధినేత‌లు హాజ‌రుకావ‌డం లేదు. 

జీ20 స‌ద‌స్సుకు వ‌చ్చే నాయ‌కులు వీరే.. 

తాను ఢిల్లీ వెళ్తున్నాననీ, జీ20 సదస్సులో పాల్గొంటానని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం, సామాజిక ప్రభావం, క్లీన్ ఎనర్జీ పరివర్తన, వాతావరణ మార్పులపై పోరాటం, పేదరికంతో పోరాడటానికి బహుళపక్ష బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం గురించి బైడెన్ చర్చించాలని భావిస్తున్నారు. అలాగే, బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ తన తొలి అధికారిక పర్యటనలో న్యూఢిల్లీలో జరిగే జీ20 సదస్సులో పాల్గొంటారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా కూడా తాను జీ-20 స‌ద‌స్సులో పాలుపంచుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, జీ7 చైర్మన్ గా ఉక్రెయిన్ తో యుద్ధం నేప‌థ్యంలో రష్యాపై విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.

జీ20 లో భాగ‌మైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రస్తుతం ఇండోనేషియాలో ఉన్నారనీ, అయితే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ లో ఉంటారని ఆయన కార్యాలయం ధృవీకరించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సదస్సుకు హాజరవుతారనీ, ఈ సందర్భంగా ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ సదస్సులో పాల్గొంటారని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. రష్యా, చైనా గైర్హాజరైనప్పటికీ ఈ శిఖరాగ్ర సమావేశం చాలా ముఖ్యమైనదని జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ అన్నారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర బెదిరింపులు, క్షిపణి ప్ర‌యోగాల‌తో రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సదస్సులో నాయకులను కోరే అవకాశం ఉంది. వీరితో పాటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ట‌ర్కీ అధ్య‌క్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కూడా ఢిల్లీలో జ‌రిగే జీ-20 స‌ద‌స్సుకు హాజ‌రు కానున్నారు.

జీ-20 స‌దస్సుకు ఎవ‌రు రావ‌డం లేదంటే.. 

న్యూఢిల్లీలో జ‌రిగే జీ20 సదస్సుకు గైర్హాజరైన వారిలో జిన్ పింగ్ కూడా ఉన్నారు. ఆయన గైర్హాజరీలో చైనా ప్రధాని లీ కియాంగ్ ఆ దేశ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తారు. 2008లో జరిగిన జీ20 నేతల సదస్సు త‌ర్వాత చైనా అధ్యక్షుడు గైర్హాజరు కావడం ఇదే తొలిసారి. వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది జీ20 సదస్సుకు దూరం కానున్నారు. ఉక్రెయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) రష్యా అధ్యక్షుడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది, దీనిని క్రెమ్లిన్ తీవ్రంగా ఖండించింది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు అరెస్టు అయ్యే ప్రమాదం ఉంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ న్యూఢిల్లీలో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ గురువారం తనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందనీ, జీ20 సదస్సుకు హాజరు కాలేనని ప్రకటించారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ ఈ మెగా ఈవెంట్ కు హాజరు కావడం లేదు.

న్యూఢిల్లీ సదస్సుకు హాజరుకానున్న నాన్ జీ20 సభ్యదేశాలు ఇవే.. 

జీ20 సభ్యదేశాలతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నైజీరియా, ఈజిప్ట్, మారిషస్, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతలను భారత్ ఆహ్వానించింది. అలాగే, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2026 Sankranthi celebrations in Delhi | PM Modi Powerful Pongal Speech | Asianet News Telugu
Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu