ఆర్.జి.చంద్రమోహన్ ది ఒక పేద కుటుంబం. గొప్పగా ఏం చదువుకోలే. కానీ ఇప్పుడతను కోట్లకు అధిపతి అయ్యాడు. ఇతను భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీలలో ఒకదాన్ని నిర్మించాడు.
భారతీయ బిలియనీర్ల జాబితాలో ఆర్జీ చంద్రమోహన్ ది చెప్పుకోదగ్గ గొప్ప కథ. చదువుకు దూరమైనా.. అమ్మకాల పరంగా దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ సంస్థను స్థాపించారు. 74 ఏళ్ల ఆర్జీ చంద్రమోహన్ హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ చైర్మన్ గా ఉన్నారు. దీన్ని ఎలా ప్రారంభించాడో తెలుసా? తోపుడు బండ్లపై ఐస్క్రీమ్ ను అమ్ముతూ.. ఆర్జీ చంద్రమోహన్ ప్రైవేట్ డెయిరీ సంస్థను ఎలా స్థాపించారు. ఆయన పడ్డ కష్టాలేంటి? ఎదుర్కొన్న నష్టాలేంటి? ఆయన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నైకి చెందిన వ్యాపారవేత్త చంద్రమోహన్ కు అంకెలు, గణితంపై ఎక్కడలేని పట్టు ఉంది. అందుకే కొంతమంది ఆయన్ను హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తారు. అయితే ఇతను మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇంకేముందు 21 ఏండ్ల వయసులోనే చదువుకు దూరమై వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
అతని తండ్రి చిన్న ప్రొవిజన్ షాప్ యజమాని. అయితే చదువు మానేయడంతో చంద్రమోహన్ టింబర్ డిపోలో కేవలం రూ.65 జీతంతో ఉద్యోగం చేస్తూ కెరీర్ ప్రారంభించాడు. ఏడాది తర్వాత ఆ ఉద్యోగం మానేసి 250 చదరపు అడుగుల గదిలో కేవలం ముగ్గురు కార్మికులతో ఐస్ క్రీమ్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది దీంతో కుటుంబ ఆస్తులను అమ్మగా వచ్చిన రూ.13,000తో తన ప్రారంభించాడు. అతను 15 తోపుడు బండ్లపై ఐస్ క్రీం అమ్మకం మొదలుపెట్టాడు.
అయితే కంపెనీని స్టార్ట్ చేసిన మొదట్లో కంపెనీ కష్టాల్లో ఉంది. అయినప్పటికీ తొలి ఏడాదిలోనే రూ.1.5 లక్షలు సంపాదించాడు చంద్రమోహన్. దీంతో అతని ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. 1981 సంవత్సరంలో అది ఒక చిన్న వ్యాపారం మాత్రమే. అయితే చంద్రమోహన్ చిన్న పట్టణాలకు కూడా తన ఐస్ క్రీం ను అమ్మాలనుకున్న ఆలోచన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. చంద్రమోహన్ తమిళనాడులో 1981లో అరుణ్ ఐస్ క్రీం ను ప్రారంభించాడు.1986 లో అతను తన కంపెనీ పేరును ప్రస్తుత హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ గా మార్చాడు.
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ డెయిరీ కంపెనీల్లో ఒకటైన హట్సన్ ప్రతిరోజూ 10,000 గ్రామాల్లో 4 లక్షల మంది రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ మార్కెట్ క్యాప్ రూ.18,889 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా ప్రకారం.. ఆర్జీ చంద్రమోహన్ రూ.13,000 కోట్లకు పైగా (1.7 బిలియన్ డాలర్లు) సంపదను కలిగి ఉన్నారు. తన కంపెనీ పాల ఉత్పత్తులను 42 దేశాల్లో వినియోగిస్తున్నారు. చంద్రమోహన్ చైర్మన్ గా ఉండగా, ఆయన కొడుకు సి.సత్యన్ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా హట్సన్ ను నడుపుతున్నారు.