
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ అంటే అందరికీ వెంటనే స్విగ్గీ లేదా జొమాటోలు గుర్తుకు వస్తాయి. ఇవి రెండు ఫుడ్ డెలివరీ సెక్టార్‌లో దీటైన ప్రత్యర్థులు. ఒక దానిపై మరొకటి పోటీతో పని చేస్తుంటాయి. ఈ పోటీ కేవలం బిజినెస్‌లోనే ఉంటుంది. స్ట్రాటజీ, ఆఫర్‌లలో పోటీ గట్టిగా ఉండొచ్చు. కానీ, ఈ సంస్థల డెలివరీ బాయ్స్ మాత్రం పోటీ గురించి పట్టించుకోవడం అరుదు. ఉపాధి కోసం బైక్‌ను రోడ్డపైకి తీసి డెలివరీ ఐటమ్‌లను బ్యాగ్‌లో సర్దుకుని ట్రాఫిక్‌లో వాహనాల మధ్య నుంచి దూసుకెళ్లి.. ఇరుకైన సందుల్లో జాగ్రత్తగా ప్రయాణిస్తూ సకాలంలో డెలివరీని గమ్యానికి చేరుస్తారు. కష్టపడి సకాలంలో డెలివరీ చేయడం డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. అవసరం, పరిస్థితులు బట్టి వారు ఈ సంస్థలనూ మార్చుకుంటూ ఉంటారు. అంటే, స్విగ్గీ, జొమాటో అనే తేడా వారికి ఉండదు. ఈ కామన్ పాయింటే డెలివరీ బాయ్స్ అందరినీ ఒక గూటికి చేరుస్తుంది. చాలా వాళ్లు తామంతా ఒకటే అనే ఫీలింగ్‌లో ఉంటారు. అందుకే ఒకరి కష్టాలను ఇంకొకరు పంచుకోవడానికి వెనుకాడరు.
దీనికి నిదర్శనంగా నిలుస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇద్దరు డెలివరీ బాయ్‌లు రోడ్డుపై ఆర్డర్‌లు పట్టుకుని డెలివరీ చేయడానికి వెళ్లుతూ ఆ వీడియోలో కనిపించారు. జొమాటో డెలివరీ బాయ్ సైకిల్ పై వెళ్లుతుండగా.. స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్ పై వెళ్లుతున్నాడు. బైక్ పై వెళ్తున్న డెలివరీ బాయ్.. జొమాటో డెలివరీ బాయ్‌ను చూసి.. స్నేహహస్తం అందించాడు. బైక్ పై వెళుతున్న స్విగ్గీ డెలివరీ బాయ్.. సైకిల్ పై ఉన్న జొమాటో డెలివరీ బాయ్ చేయిని పట్టుకున్నాడు. దీంతో ఇరువురూ వేగంగా ప్రయాణించగలిగారు. తద్వార జొమాటో డెలివరీ బాయ్ కొంత ఉపశమనం పొంది సకాలంలో డెలివరీ కూడా అందించగలిగాడు.
వీరిద్దరూ రోడ్డుపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని ప్రయాణిస్తుండగా వారి వెనుక కారులో ప్రయాణిస్తున్న ఒకరు వీడియో తీశారు. ఆ వీడియోను Sannah Arora అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ వీడియో తెగ వైరల్ అయింది. నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కొందరు ఫ్రెండ్‌షిప్ గురించి కామెంట్లు చేయగా.. ఇంకొందరు డెలివరీ బాయ్‌ల అగచాట్ల గురించి చర్చించారు.
ఈ వీడియో పోస్టు చేస్తూ.. సన్నా అరోర్ ఓ కామెంట్ పెట్టారు. ఢిల్లీలో నేటి అసాధారణ పరిస్థితుల్లో.. మండుతున్న ఎండల్లో నిజమైన ఫ్రెండ్‌షిప్‌ను కనిపించిందని వివరించారు.