
న్యూఢిల్లీ: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ అంశంపై అఖిలపక్ష భేటీని నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగిస్తారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై వివరాలు వెల్లడిస్తారని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇదే సమావేశంలో తమిళనాడుకు చెందిన పార్టీలు ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలు తమిళులు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. వెంటనే శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ఏఐఏడీఎంకే నేత ఎం తంబిదురై, డీఎంకే నేత టీఆర్ బాలులు విజ్ఞప్తి చేశాయి.
ఈ పార్టీల విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించిన సంగతి తెలిసిందే.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారు పోరాట రూపం తీసుకోవడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసం వదిలి పారిపోయారు. ప్రధానమంత్రి రానిల్ విక్రమ్ సింఘే రాజీనామా ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కొనసాగుతానని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పొరుగు దేశంలోని ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై భారత ప్రభుత్వ వైఖరిని కొందరు విలేకరులు అడిగారు. దీనికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాధానం ఇచ్చారు.
శ్రీలంకకు భారత్ సమీప పొరుగు దేశం అని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు లోతైన నాగరిక బంధాలను కలిగి ఉన్నాయని వివరించారు. శ్రీలంక, సింహళీయులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై తమకు అవగాహన ఉన్నదని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్న శ్రీలంక ప్రజల వెంట భారత్ ఉన్నదని పేర్కొన్నారు.
శ్రీలంకలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను తాము దగ్గరగా చూస్తున్నామని అరిందమ్ బాగ్చి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామిక మార్గంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, విలువల చట్రంలోనే తమ ఆశలను, ప్రగతిని సాధించుకోవాలని శ్రీలంక ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఈ మార్గంలో శ్రీలంక పౌరుల వెంట భారత్ నిలబడుతుందని పేర్కొన్నారు.
పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చే భారత విధానంలో శ్రీలంక కేంద్ర స్థానం ఆక్రమిస్తుందని ఆయన వివరించారు. శ్రీలంక ఎదుర్కొంటున్న తీవ్ర, జఠిల ఆర్థిక పరిస్థితులను అదిగమించడానికి భారత్ ఇప్పటికే సుమారు 3.8 బిలియన్ల అమెరికన్ డాలర్లతో సహకారాన్ని అందించిందని తెలిపారు.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇంతటి సంక్షోభాన్ని చూడలేదు. చమురు సహా ఇతర అత్యవసర సరుకులనూ దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర విదేశీ మారకం లేదు. దీంతో ప్రజలు దిన దిన గండంగా బతుకుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌ల ముందు వాహనాల్లో కిలోమీటర్ల మేర క్యూలో ఉంటున్నారు. కొందరైతే.. ఈ క్యూలో నిలిపిన వాహనాల్లోనే మరణిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఇది వరకే హింసాత్మక ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రధానిగా మహింద రాజపక్స రాజీనామా కూడా చేశారు. తాజాగా, మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు రాజధాని నగరానికి పోటెత్తారు. అయితే, గొటబాయ రాజపక్స రాజీనామా ప్రకటనతో ఆందోళనకారుల వెనక్కి తగ్గారు.