
చెన్నై: తమిళనాడులో దారుణం జరిగింది. ఇద్దరు మిత్రులు క్షుద్రపూజలను విశ్వసించారు. క్షుద్రపూజలతో చంపేయవచ్చని, ఎదుటి వారిని బుట్టలో వేసుకోవచ్చని, భూతాలను అదుపులో పెట్టుకోవచ్చనే మాటలను నమ్మారు. నమ్మడమే కాదు.. అందులో ఒకరు మాంత్రికుడిగానే ఉన్నాడు. అతని మిత్రుడు కూడా క్షుద్రపూజలను నమ్మాడు. ఇద్దరూ ఒకే అద్దె ఇంటిలో చాలా కాలం కలిసే ఉన్నారు. కానీ, వీరిమధ్య అనుమానం తిష్ట వేసింది. అది దినదినం పెరుగుతూ వచ్చింది. తన ఫ్రెండ్ అయిన మాంత్రికుడు క్షుద్రపూజలతో తన తల్లిని మాయలో పడేసుకున్నాడని అనుమానించాడు. అంతేకాదు, అవే మంత్రాలతో తనను చంపేసే ప్లాన్ వేస్తున్నాడనీ అనుకున్నాడు. ఈ అనుమానమే ఆ మాంత్రికుడి ప్రాణాలు తీసింది. ఇంటికి రప్పించి మరీ ఆ మాంత్రికుడిని మిత్రుడు కత్తితో పొడిచి చంపేశాడు. ‘క్షుద్రపూజలతో చింతకాయలు రాలవు’ కానీ, ఆ క్షుద్రపూజ అనుమానం మాత్రం నిజంగానే ప్రాణాలు తీసింది.
చెన్నైలోని వన్నారపేటకు చెందిన సయ్యద్ సికిందర్, విక్కి ఒకే అద్దె ఇంటిలో ఉండేవారు. వారిద్దరూ మంచి మిత్రులు. తిరుమంగళం పడకుప్పం గాంధీనగర్‌లో అద్దెంటిలో ఉన్నారు. సయ్యద్ సికిందర్ క్షుద్రపూజలను వృత్తిగా చేసుకుని మాంత్రికుడిగా జీవిస్తున్నాడు. మాంత్రికుడైనప్పటికీ విక్కి మాత్రం ఆయన సావాసం వదిలిపెట్టుకోలేదు.
Also Read: మిరాకిల్: యాక్సిడెంట్ తర్వాత బాలుడి తలను తిరిగి అతికించిన ఇజ్రాయెల్ డాక్టర్లు
కొన్నాళ్లుగా సికిందర్ క్షుద్రపూజలతో తన తల్లిని వలలో వేసుకున్నాడని విక్కీ అనుమానించాడు. తన తల్లిని సికిందర్ చనువుగా ఉంటున్నాడని అనుకున్నాడు. తన తల్లిని లొంగదీసుకోవడమే కాకుండా.. తననూ చంపాలని క్షుద్రపూజలు చేస్తున్నాడని సికిందర్ అనుమానించాడు. ఈ అనుమానం విక్కిలో పెరుగుతూ పోయింది. దీంతో చివరకు సికిందర్‌ను చంపేయాలని అనుకున్నాడు.
సికిందర్‌ను చంపడా నికి విక్కి పక్కా ప్రణాళిక వేసుకున్నాడు. తిరుమంగళంలోని తన ఇంటిలో పూజలు చేయాలని సికిందర్‌ను పిలిచాడు. సికిందర్ విక్కి ఇంటికి ఏమీ ఆలోచించకుండా వెళ్లిపోయాడు. విక్కి ఇంటిలో సికిందర్ పూజలో మునిగిపోయాడు. ఈ తరుణంలో విక్కి కత్తితో సికిందర్‌ను పొడిచేశాడు. సికిందర్ మరణించాడు.