
కోయంబత్తూరు : తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చి సమీపంలోని నల్లూర్ గ్రామంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక పోలీసు అధికారి, ఒక మహిళ వారి ఇంట్లో సజీవ దహనం అయినట్లో అధికారులు తెలిపారు. మృతులను చెన్నైలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శబరీనాథ్, శాంతిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లోని రిఫ్రిజిరేటర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వారు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు, అగ్నిమాపక, రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారు. పోస్టుమార్టం ఇంకా చేయాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో ఓ విషాదకర ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. ఇంట్లో మంటలు చెలరేగి తల్లి, ఇద్దరు కూతుర్లు సజీవ దహనం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం రాయచూరు తాలూకా శక్తి నగర్ కెపిసిఎల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని రంజిత (33), మృదుల (13), తారుణ్య(5)గా గుర్తించినట్లు శక్తి నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు. ఇంట్లోని ఏసీలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. అయితే, ఇంట్లో మంటలు పూర్తిగా అలుముకోవడానికి స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు.
ఈ ఘటన మీద సమాచారం అందడంతో రాయచోటి ఎస్పీ సత్యనారాయణ, శక్తి నగర్ పిఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. శక్తి నగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్న సిద్ధ లింగయ్య కుటుంబం ఈ ప్రమాదానికి గురైంది. సిద్ధ లింగయ్య మండ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో సిద్ధ లింగయ్య ఇంట్లో లేరు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మంటల కారణంగా అలుముకున్న దట్టమైన పొగ చుట్టుపక్కల ఇళ్లకు కూడా వ్యాపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.