పన్ను చెల్లింపుదారుల నిధుల వ్యయంతో ఉచితాలు రాష్ట్రాల దివాలాకు దారితీయవచ్చు: సుప్రీం కోర్టు

By Sumanth KanukulaFirst Published Aug 27, 2022, 11:45 AM IST
Highlights

ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి రూపొందించిన సంక్షేమ కార్యక్రమాలతో ఉచితాలను పోల్చలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ఉచితాలపై సుప్రీం ధర్మాసం శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. 

ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి రూపొందించిన సంక్షేమ కార్యక్రమాలతో ఉచితాలను పోల్చలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే పన్నుచెల్లింపుదారుల సొమ్మును వినియోగించుకుని ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారని.. ఇది రాష్ట్రాలను దివాలా దిశగా నెట్టివేసే అవకాశం ఉందని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు.. వారి ప్రజాదరణను పెంచుకోవడానికి, గెలుపు అవకాశాలను పెంచుకోవడానికి వీటిని ఉపయోగించుకుంటున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. 

రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చే ఉచిత హామీలకు వ్యతిరేకంగా వచ్చిన అన్ని అప్పీళ్లపై విచారణ బాధ్యతను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి ముందు జాబితా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి లోతైన అధ్యయనం జరగాలని పేర్కొంది. 

ప్రజాస్వామ్యంలో నిజమైన అధికారాన్ని ఓటర్లు కలిగి ఉంటారని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఎన్నికలలో ఏ పార్టీ లేదా అభ్యర్థి విజయం సాధించాలో నిర్ణయించేది ఓటర్లేనని తెలిపింది. . పదవీ కాలం ముగిసిన తర్వాత సదరు పార్టీ లేదా అభ్యర్థి పనితీరు ఎలా ఉందో ఓటర్లే నిర్ణయించుకొని.. తదుపరి ఎన్నికల్లో తీర్పు చెప్తారని ధర్మాసనం తెలిపింది. 

2013‌లో ఎస్‌ సుబ్రమణియం బాలాజీ వర్సెస్‌ తమిళనాడు ప్రభుత్వం, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని విచారణ సందర్భంగా వాదనలు వచ్చాయని వెల్లడించింది. ఉచిత హామీల విషయంలో సంక్లిష్టతలను, ద్విసభ్య ధర్మాసనం తీర్పును దృష్టిలో పెట్టుకొని వ్యాజ్యాలపై విచారణ బాధ్యతను త్రిసభ్య ధర్మాసనానికి అప్పగిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. 

click me!