
Free bus travel begins in Karnataka: కర్నాటకలో చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. ఒక పెద్దావిడ బస్సులోకి ఎక్కే ముందు బస్సు మెట్ల వద్ద కొద్దిగా ఒంగి నమస్కరించడం కనిపించింది. బస్సు ఎక్కే ముందు ఇలా చేయడం కాస్త విచిత్రంగా అనిపించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంతో ఆ పెద్దావిడే కాకుండా అక్కడి మహిళలందరూ ఆనందపడుతూ.. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఫొటో వెనుక ఉన్న అసలు కథ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన శక్తి పథకం.. ! శక్తి పథకం కర్నాటకలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే బెళగావి జిల్లాలోని సంగోలి గ్రామంలో తన మనవడి గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్తుండగా "శక్తి" లబ్దిదారు నింగవ్వా సంగడి బస్సుకు నమస్కరించారు. అనంతరం తన ప్రయాణం కొనసాగించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి ఆదివారం బెంగళూరులోని విధానసౌధలో ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు (కర్నాటక ఆర్టీసీలు) అందించే నాన్ ప్రీమియర్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే 'శక్తి' పథకాన్ని ప్రారంభించారు. శక్తి పథకం రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది. ఐదు ఎన్నికల హామీలలో ఒకటైన శక్తిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నెల రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం.
భారతదేశంలో ప్రజా జీవితంలో మహిళల ప్రాతినిధ్యం 2014కు ముందు స్థాయి 30% నుండి 24% కి పడిపోయిందని పేర్కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. మహిళల ప్రాతినిధ్యంలో భారతదేశం అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల కంటే వెనుకబడి ఉందని అన్నారు. "మహిళల ప్రాతినిధ్యం అన్ని రంగాల్లోనూ పెరగాలనీ, శక్తి మహిళల సాధికారతకు ఒక సాధనం మారాలని" సీఎం అన్నారు. కాగా, ప్రతిరోజూ దాదాపు 42 లక్షల మంది మహిళలు ఈ శక్తి పథకం ద్వారా లబ్ది పొందుతారని అంచనా. ఇది అంతటా ఉపయోగించుకోగలిగినప్పటికీ.. కర్ణాటక, కొన్ని అంతర్రాష్ట్ర మార్గాలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి.కాగా, ప్రయివేటు సంస్థల గుత్తాధిపత్యం ఉన్న జిల్లాలో కేఎస్ఆర్టీసీ బలాన్ని పెంచేలా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఉడిపిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ తెలిపారు.