
ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) పరిధిని గణనీయంగా తగ్గించినందుకు మూడు నాలుగేళ్ల నుంచి పనులు జరుగుతున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవలను ఆయన ప్రశంసించారు. ఒక రోజు పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం ఆస్సాం చేరుకున్నారు.
ఈ సందర్భంగాలో గౌహతిలో ఏర్పాటు చేసిన 1971 యుద్ధవీరుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ గత 3-4 సంవత్సరాలుగా, ఈశాన్య రాష్ట్రాల్లో AFSPA తొలగించే పని జరుగుతోంది. ఇది చిన్న విషయం కాదు. ఇటీవల అస్సాంలోని 23 జిల్లాల నుంచి AFSPA పూర్తిగా తొలగించబడింది’’ అని రక్షణ శాఖ మంత్రి తెలిపారు.
‘‘ మణిపూర్, నాగాలాండ్‌లోని 15 పోలీసు స్టేషన్‌ల నుంచి AFSPA తొలగించబడింది. దానిలో చాలా అర్థం ఉంది. ఈ విషయం ఈ ప్రాంతంలో మన్నికైన శాంతి, స్థిరత్వానికి ఫలితం.’’ అని ఆయన అన్నారు. నాగాలాండ్‌లోని ఏడు జిల్లాల్లోని 15 పోలీస్ స్టేషన్ ప్రాంతాల నుండి AFSPA ఉపసంహరిస్తున్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మణిపూర్ లోని ఆరు జిల్లాల్లో 15 పోలీస్ స్టేషన్ ప్రాంతాలతో పాటు అస్సాంలో 23 జిల్లాల్లో పూర్తిగా, ఒక జిల్లాలో పాక్షికంగా ఈ చట్టాన్ని మినహాయించారు.
‘‘ దశాబ్దాల తర్వాత నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) కింద ఉన్న ప్రాంతాలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది’’ అని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్న సైనికుల త్యాగాలను పురస్కరించుకుని అస్సాం ప్రభుత్వం శుక్రవారం సన్మాన, అవార్డు వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఆయన మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. నేటి కార్యక్రమం పూర్తయిన తరువాాత గౌహతిలోని ఖానాపరాలోని వెటర్నరీ ఫీల్డ్‌లో జరిగే 7వ భారత పారిశ్రామిక ప్రదర్శన (UDYAM 2022)కి కూడా రక్షణ మంత్రి హాజరుకానున్నారు. రక్షణ మంత్రి పర్యటన సందర్భంగా గౌహతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
1958లో ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తీసుకొచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో, అల్లరు చోటుచేసుకునే ప్రాంతాల్లో పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడానికి సాయుధ బలగాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తిపై హెచ్చరికలు జారీ చేసిన తరువాత అతనిపై బలవంతంగా కాల్పులు జరపడానికి కూడా బలగాలకు అనుమతి ఉంటుంది. ఈ చట్టం ఎలాంటి వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చట్టం వల్ల సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే దీని వల్ల అమాయక ప్రజలపై కూడా కొన్ని సార్లు కాల్పులు జరిగాయి. దీంతో ఈ చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎత్తేయాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో దీనిని తొలగించారు.