
బోరు బావిలో పడిన ఆరేళ్ల చిన్నారిని అధికారులు కాపాడారు. ఉత్తరప్రదేశ్ హాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మూడు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్దల నిర్లక్ష్యం పిల్లల పాలిట శాపంగా మారుతోంది. బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోతే వాటిని పూర్తిగా మూసివేయాల్సి వుంటుంది. కానీ కొందరు వాటిని అలాగే వదిలేస్తున్నారు. దీంతో ఈ విషయం తెలియని చిన్నారులు బోరు బావిలో పడిపోతున్నారు.
తతరచూ దేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నా జనం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. తాజాగా యూపీలోని హాపూర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆడుకుంటూ బోరు బావి వైపుగా వెళ్లిన ఆరేళ్ల చిన్నారి దానిలో పడిపోయాడు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు , అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అక్కడికి చేరుకుని రక్షించే చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also REad: బోరుబావిలో ఎనిమిదేండ్ల బాలుడు.. 84 గంటల పాటు మృత్యుతో పోరాటం.. చివరికి...
ఇకపోతే.. గత నెలలో మధ్యప్రదేశ్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలుడు బోరు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా మాండ్వీకి చెందిన సునీల్ సాహు ఎనిమిదేళ్ల కుమారుడు తన్మయ్ పాత బోరుబావిలో పడిపోయాడు.సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఈఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 50 అడుగుల లోతులో తన్మయ్ ఇరుక్కుపోయినట్టు గుర్తించారు.
బోర్‌వెల్‌కు దాదాపు 30 అడుగుల దూరంలో బుల్‌డోజర్, పొక్లెన్ మిషన్‌తో సొరంగం తవ్వడం ప్రారంభించారు. పొక్లెన్ యంత్రంతో సుమారు 50 అడుగుల లోతు వరకు తవ్వి, ఆ తర్వాత చిక్కుకున్న చిన్నారి వరకు టన్నెలింగ్ పనులు చేసి బయటకు తీశారు. బోరుబావిలో నుంచి బయటకు తీసిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆ బాలుడి ప్రాణాలకు కాపాడలేకపోయారు. తన్మయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సివిల్ సర్జన్ అశోక్ బరంగ సమక్షంలో వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. బోరుబావిలోంచి బయటకు తీసినప్పుడు కొడుకు ముఖం కూడా చూపించలేదని తన్మయ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.