బోరుబావి క్లీన్ చేయడానికి దిగి.. విషవాయువులు పీల్చి నలుగురు దుర్మరణం

By telugu teamFirst Published Sep 26, 2021, 10:41 AM IST
Highlights

బోరుబావి నుంచి తట్టుకోలేనంతగా దుర్వాసన వస్తుండటంతో హనీఫ్ దాన్ని క్లీన్ చేయాలనుకున్నాడు. అందుకోసం నలుగురు కూలీలను మాట్లాడుకుని వచ్చాడు. కానీ, ఆ దుర్వాసనే లోపల విషపూరిత వాయువులని వారికి తెలియలేదు. ఒకరి వెనుక ఒకరు దిగుతూ వెళ్లారు. లోపలికి వెళ్లిన నలుగురూ ఊపిరాడక స్పృహ కోల్పోయారు. కొంతసేపటికి వారిని హాస్పిటల్‌ తీసుకెళ్లడంతో వారు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.

గురుగ్రామ్: హర్యానా(Haryana)లో దుర్ఘటన చోటుచేసుకుంది. బోర్‌వెల్(Borewell) క్లీన్ చేయడానికి దిగి.. అందులోని విషవాయువు(Poisonous gases)లు పీల్చి నలుగురు స్పాట్‌లో చనిపోయారు. ముందుగా ఓ వ్యక్తి బోరుబావిలోకి దిగాడు. కానీ, అక్కడి విషవాయువులతో ఊపిరాడలేదు. శ్వాస అందక లోపలే చనిపోయాడు. ఆయనను బయటికి తీసుకురావడానికి వెళ్లిన మరో ముగ్గురూ అదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానా నూహ్ జిల్లాలోని నిమ్కా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

హనీఫ్ పంటపొలంలోని బోర్‌వెల్‌ నుంచి కొంతకాలంగా దుర్వాసన వస్తున్నది. అదేమిటో తేల్చుకోలేకపోయారు. బోరుబావిని క్లీన్ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా నలుగురు కూలీలు జంషెడ్, షహీద్, జకీర్, యహాయలను తీసుకువచ్చాడు.

తొలుత జంషెడ్ బోరుబావిలోకి దిగాడు. దిగీ దిగగానే ఆయన శ్వాస అందక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో పైన ఉన్నవారికి అనుమానం వచ్చింది. జంషెడ్‌ను బయటకు తేవడానికి షహీద్, జకీర్, యహాయలు ఒకరివెనుక ఒకరు బోరుబావిలోకి దిగారు. వెళ్లినవారు వెళ్లినట్టుగానే అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వారిని బయటకు తీయడానికి హనీఫ్ తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ, విఫలమయ్యాడు. దీంతో చుట్టుపక్కల పంటచేనులో పనిచేస్తున్నవారిని పిలుచుకువచ్చాడు. ఆ రైతులూ అక్కడికి చేరగానే హనీఫ్ కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే రైతులు వారిని సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

ప్రస్తుతం హనీఫ్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, జంషెడ్, షహీద్, జకీర్, యహాయలు అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ నలుగురి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించాల్సి ఉన్నదని, ఆ తర్వాత వాటిని వారి కుటుంబాలకు అప్పగిస్తామని బిజోర్ స్టేషనర్ హౌజ్ ఆఫీసర్ అజవీర్ సింగ్ తెలిపారు.

ఘటనాస్థలి దగ్గర వాతావరణమంతా గందరగోళంగా మారిందని ఓ గ్రామస్తుడు చెప్పాడు. అక్కడి నుంచి దుర్వాసన రావడంతో బోరుబావి దగ్గరకు చేరడానికి రైతులు తటపటాయించారని వివరించారు. వారంతా బోరుబావికి ఆలస్యంగా వెళ్లడంతో జరగాల్సిన ముప్పు జరిగిపోయిందని అన్నారు.

click me!