హిమాచల్‌ప్రదేశ్‌లో మురికివాడలో చెలరేగిన మంటలు.. నలుగురు సజీవదహనం.. మృతుల్లో ముగ్గురు తోబుట్టువులు

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 11:43 AM IST
Highlights

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అంబ్ సబ్ డివిజన్‌లోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవదహనం అయ్యారు. 

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అంబ్ సబ్ డివిజన్‌లోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగాయి. రెండు గుడిసెల్లో మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు.. బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన భదేశ్వర్ దాస్, రమేష్ దాస్‌లు హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలోని అంబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బనే డి హట్టిలోని మురికివాడలో నివాసం ఉంటున్నారు. 

భదేశ్వర్ దాస్, రమేష్ దాస్‌లకు చెందిన గుడిసెల్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని  మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేశాయి. అయితే ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సజీవదహనం అయ్యారు. మృతుల్లో రమేష్ దాస్ ముగ్గురు పిల్లలు నీతూ, గోలు కుమార్, శివమ్ కుమార్‌తో పాటు వారి బంధువు కాళిదాస్ కుమారుడు సోను కుమార్ ఉన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలు పరిశీలించారు. అగ్ని ప్రమాదం చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

ఇక, ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్‌ అగ్నిహోత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. 

click me!