
ముంబయి: నలుగురు ముఠాగా ఏర్పడి ఆర్థిక మోసం చేయాలని ప్రయత్నించారు. ఏకంగా ఎమ్మెల్యేకే టోకరా కొట్టే ప్రయత్నం చేశారు. తాము ఢిల్లీ నుంచి వచ్చామని, క్యాబినెట్ బెర్త్ కావాలంటే ఇప్పిస్తామని, అందుకు రూ. 100 కోట్లు కావాలని డిమాండ్ చేశారు. సదరు ఎమ్మెల్యే చాకచక్యంగా వ్యవహరించి వారిని పోలీసు ఉచ్చులో పడేశారు.
రియాజ్ షేక్, యోగేశ్ కులకర్ణి, సాగర్ సంగ్వాయ్, జాఫర్ అహ్మద్ రషీద్ అహ్మద్ ఉస్మానీ అనే నలుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. పెద్ద మొత్తంలో డబ్బు లాక్కుని పారిపోవాలని ప్రయత్నించారు. అందుకు వారు ఏకంగా ఒక బీజేపీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు.
మహారాష్ట్ర పూణె జిల్లా దౌండ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాహుల్ కుల్‌కు షేక్ అనే నిందితుడు ఫోన్ చేశాడు. కానీ, ఎమ్మెల్యే ఆ ఫోన్ కాల్‌కు రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత వారు ఎమ్మెల్యే పీఎను ఆశ్రయించారు. తాము ఢిల్లీ నుంచి వచ్చారని, ఎమ్మెల్యేను కలవాలని పీఎకు తెలిపారు. ఆయన రిక్వెస్ట్ పై వారు షేక్, ఎమ్మెల్యే కుల్‌కు నారిమాన్ పాయింట్ వద్ద సమావేశానికి ఏర్పాటు చేశారు. ఆ భేటీలో ఎమ్మెల్యే రాహుల్ కుల్‌కు రియాజ్ షేక్ ఓ ఆఫర్ చేశాడు. మంత్రి పదవి ఆఫర్ చేశాడు. కానీ, అందుకు రూ. 100 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నాడు. దీనికి ఆ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ డీల్ అమౌంట్‌ను రూ. 100 కోట్ల నుంచి రూ. 90 కోట్లకు తగ్గించి అంగీకరించారు.
ఆ మొత్తంలో 20 శాతం అంటే రూ. 18 కోట్లు ముందస్తుగా ఇవ్వాలని రియాజ్ షేక్.. ఆ ఎమ్మెల్యేను డిమాండ్ చేశాడు. అయితే, ఈ అడ్వాన్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి షేక్‌ను ఓ ప్రముఖ హోటల్‌కు రావాలని ఎమ్మెల్యే కుల్ చెప్పారు. అదే సమయంలో ముంబయి పోలీసులకు ఈ మోసం గురించి అలర్ట్ చేసి పెట్టారు.
అడ్వాన్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి రియాజ్ షేక్ సోమవారం మధ్యాహ్నం హోటల్‌కు రాగానే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతన్ని విచారించగా.. మరో ముగ్గురి పేర్లను ఆయన చెప్పాడు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.