
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ రోజు ఉదయం నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కాబోతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా ఈడీ ముందు హాజరు కావాలని ఇది వరకే సోనియా గాంధీకి సమన్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. దీంతో ఈడీ విచారణ తేదీలను వాయిదా వేయాలని సోనియా గాంధీ కోరారు. ఇందుకు ఈడీ అంగీకరించింది. తాజాగా, ఈ రోజు ఈడీ ముందు హాజరు కావాలని వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా నేడు సోనియా గాంధీ ఈడీ ముందు హాజరుకాబోతున్నారు.
కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఆమె ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు బయల్దేరతారు. కాంగ్రెస్ అధ్యక్షులను ఏ దర్యాప్తు ఏజెన్సీ అయినా విచారించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సోనియా గాంధీ కంటే ముందు రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఆయనను ఐదు రోజులపాటు 50 గంటలు విచారించింది.
ఇదిలా ఉండగా సోనియా గాంధీ ఈడీ ముందు హాజరు కావడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాకు ప్లాన్ చేసింది. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయనుంది. తమ తమ ప్రాంతాల్లో ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ పార్టీ స్టేట్ యూనిట్‌లకు సూచించింది.
ఆందోళనలపై ఓ ప్రణాళిక రూపొందించడానికి ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. బుధవారం సమావేశమై నేటి ధర్నా కోసం ప్లాన్ ఫైనల్ చేశారు. ప్రతిపక్షాల గళం నొక్కేయాలని చూడటం దారుణం అని, కాంగ్రెస్ ఐక్యంగా సోనియా గాంధీ వెంటే ఉన్నదని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.
ఢిల్లీలో అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లో పార్టీ కార్యకర్తలు గుమిగూడుతారు. అక్కడి నుంచి సోనియా గాంధీ ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావడానికి బయల్దేరి వెళ్లిపోతారు. అక్కడే పార్టీ నేతలు అశోక్ గెహ్లాట్, పవన్ ఖేరాలు మాట్లాడుతారు.