ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కన్నుమూత

Siva Kodati |  
Published : Aug 21, 2021, 09:57 PM ISTUpdated : Aug 21, 2021, 10:11 PM IST
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కన్నుమూత

సారాంశం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కళ్యాణ్  సింగ్ కన్నుమూశారు. 

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 89 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కళ్యాణ్  సింగ్ కన్నుమూశారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గానూ ఆయన సేవలందించారు. ఆయనకు కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌, కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. ఆయన తనయుడు ప్రస్తుతం ఏత్‌ నుంచి భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు.  

1932, జనవరి 5న తేజ్‌పాల్‌ సింగ్‌ లోధి, సీతాదేవి దంపతులకు యూపీలోని అలీగఢ్‌ జిల్లా మధౌలీ గ్రామంలో జన్మించారు కళ్యాణ్ సింగ్. 1957లో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా మొదలై ఆ తర్వాత జన్‌సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్‌ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పట్నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన కల్యాణ్‌ సింగ్‌కు 1980లో బ్రేక్‌ పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐ) నేత అన్వర్‌ఖాన్‌ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతోనే పరాజయం చవిచూశారు.

ఆ తర్వాత 1985లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగి 1996 వరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1967 నుంచి 2002 మధ్య కాలంలో అత్రౌలి నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2002లో మాత్రం తాను స్థాపించిన రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున బరిలో నిలిచి గెలిచారు. ఈ క్రమంలోనే 1977-79లో యూపీ ఆరోగ్యమంత్రిగా, రెండు పర్యాయాలు సీఎంగా సేవలందించారు.  సెప్టెంబర్‌ 4, 2014న ఆయన రాజస్థాన్‌ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసి 2019 సెప్టెంబర్‌ 8వరకు కొనసాగారు. అదే కాలంలో 2015 జనవరి 28న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.  

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?