
పాట్నా: దేశవ్యాప్తంగా కుల గణన కొన్నేళ్లుగా వినిపిస్తున్న డిమాండ్. ఈ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో తిరస్కృత ధోరణిలో సమాధానమిచ్చింది. ఎన్‌డీఏ మిత్రపక్షం జేడీయూ ముందు నుంచే కుల గణన జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ వస్తున్నది. పలుసార్లు అసెంబ్లీలో తీర్మానాలు చేసింది. కేంద్రానికి తమ డిమాండ్‌ను సమర్పించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో మాట్లాడుతూ జనాభ గణనలో కులాన్ని పేర్కొనబోమని తెలిపిన తర్వాత దీనిపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
కుల గణన డిమాండ్‌తో బిహార్ నుంచి సీఎం నితీశ్ కుమార్ సహా ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అంతేకాదు, పది పార్టీల నేతలూ ఈ భేటీలో పాల్గొననున్నట్టు వివరించారు. సోమవారం ఈ భేటీ జరుగుతుందని సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు. కుల గణన జరగాలనేది ప్రజల డిమాండ్ అని, దీనిపై సానకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కూటమిపై ప్రభావముండదు
కుల గణనపై బీజేపీ, జేడీయూ పార్టీలు భిన్న వైఖరులు కలిగి ఉన్నప్పటికీ ఎన్‌డీఏ పొత్తుపై దాని ప్రభావం ఉండబోదని సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. బిహార్ అసెంబ్లీలో ఉభయ సభల్లోనూ కుల గణనను మద్దతిస్తూ రెండు సార్లు తీర్మానం ప్రవేశపెట్టారని వివరించారు. రెండు సార్లూ అన్ని పార్టీలూ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయని తెలిపారు.