కరోనా కట్టడి: వెనుకబడిన రాష్ట్రం కాదు, ఆదర్శంగా బిహార్.. ఒక్క రోజులో 11 కేసులే

By telugu teamFirst Published Aug 21, 2021, 5:42 PM IST
Highlights

ఉత్తరాది రాష్ట్రం బిహార్ కరోనా నియంత్రణలో ఆదర్శంగా నిలుస్తున్నది. వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న ఈ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కేవలం 24 కేసులో నమోదయ్యాయి. రికవరీ రేటు 98.63శాతానికి చేరగా, యాక్టివ్ కేసులు కేవలం 168 మాత్రమే ఉన్నాయి. టీకా పంపిణీల్లోనూ టాప్ టెన్ జిల్లాల్లో పాట్నా నిలిచింది.

పాట్నా: మనదేశంలో, ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బిహార్‌ వెనుకబడిన రాష్ట్రంగా పరిగణిస్తుంటారు. ఉత్తర భారతంలో ‘బిహారీ’ అనే పదాన్ని తిట్టుగా కూడా వాడుతుంటారు. అక్కడి పేదరికం, నేరాలు ప్రధానంగా ఈ పేరుపడటానికి కారణంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు బిహార్ ఆదర్శంగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు వెలుగుచూపేదిగా నిలుస్తున్నది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ టీకాలు వేసుకుంటూ కరోనాను పూర్తిగా అంతం చేయడానికి వడిగా అడుగులు వేస్తున్నది. 

బిహార్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 11 కేసులే నమోదయ్యాయి. ఇందులోనూ నాలుగు రాజధాని పాట్నాలోనే రికార్డ్ అయ్యాయి. గతవారంలో ఒక్క కరోనా మరణమూ సంభవించలేదు. రికవరీ రేటు 98.63శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 168 యాక్టివ్ కేసులే ఉన్నాయి. టీకా పంపిణీలో దేశంలోని 754 జిల్లాల్లో టాప్ 10 బెస్ట్ జిల్లాల్లో పాట్నా నిలవడం గమనార్హం.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టామని, ఇప్పటి వరకు తీసుకున్న రక్షణ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ప్రతయ్ అమృత్ వివరించారు. టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు కొవిడ్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, పలుమార్గాల్లో నిబంధనలను ప్రజలకు చేరువచేశామని తెలిపారు. అప్పుడు మాస్కు ధరిస్తున్నవారు సుమారు 80 నుంచి 90శాతానికి పెరిగారని చెప్పారు. ఇప్పటికీ వరదల సమస్య ఎదుర్కొంటున్న జిల్లాల్లోనూ పడవ అంబులెన్సుల సహాయంతో టీకా పంపిణీ చేస్తున్నామని అన్నారు. తొలుత టీకా పంపిణీపై సంశయాలు వెల్లడైనప్పటికీ అవగాహన పెరగడంతో వ్యాక్సిన్ కోసం పోటెత్తారు.

కరోనా కేసులు తగ్గిపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం లేదని ప్రతయ్ అమృత్ వివరించారు. థర్డ్ వేవ్ కోసమూ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడదని స్పష్టం చేశారు. ఇప్పటికే 122 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

click me!