టీచర్స్ డే వేళ విషాదం: సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు కన్నుమూత

By Siva KodatiFirst Published Sep 5, 2021, 8:12 PM IST
Highlights

సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కేశవ్ దేశిరాజు (66) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 1978 బ్యాచ్ ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన కేశవ్.. కేంద్రంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు

ఓవైపు దేశమంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటోన్న వేళ విషాదం చోటు చేసుకుంది. ఆయన మనవడు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి కేశవ్ దేశిరాజు (66) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. హృదయ సంబంధిత వ్యాధితో (కరోనరీ సిండ్రోమ్) బాధపడుతోన్న కేశవ్.. ఈ రోజు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

1978 బ్యాచ్ ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన కేశవ్.. కేంద్రంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు పదవీ విరమణ తర్వాత పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PFI)పాలక మండలి ఛెయిర్మన్ గా నియమితులయ్యారు. ఆయనకు చాలా నిజాయితీరుడైన అధికారి అనే పేరుంది. రాజీలేని మనస్తత్వం అని ఆయనతో పరిచయం ఉన్న అధికారులు చెబుతారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ఉన్నపుడు ఆయన పలు కార్యక్రమాలను విజయవంతంగా రూపొందించి అమలుచేశారు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను, కమ్యూనిటీ హెల్త్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఎకనమిక్స్ లో కేంబ్రిడ్జి నుంచి మాస్టర్ట్స్ చేసిన కేశవ్ రాజు.. తర్వాత హార్వర్డ్ జాన్ ఎఫ్ కెన్నెడీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఎ చేశారు .

ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ తర్వాత కేశవ్.. ప్రజారోగ్యంపై దృష్టి సారించారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, సమాజ ఆరోగ్యం వంటి సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకునేవారు. 2016లో వచ్చిన మెంటల్ హెల్త్ కేర్ బిల్ వెనక కేశవ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పలు పుస్తకాలకు రచయితగా.. మరికొన్నింటికి సహ రచయితగానూ వ్యవహరించారు. లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం గురించి “గిఫ్టెడ్ వాయిస్: ద లైఫ్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి” అనే పుస్తకం రాశారు. భారత వైద్య రంగంలో ఉన్న అవినీతి గురించి సమిటన్ నండీ, సంజయ్ నాగ్రాల్‌లతో కలిసి 2018లో "హీలర్స్ ఆర్ ప్రీడేటర్స్? హెల్త్ కేర్ కరప్షన్ ఇన్ ఇండియా" పుస్తకాన్ని కేశవ్ రాశారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
 

click me!