
Punjab Assembly Election 2022: ఫిబ్రవరిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడేక్కాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పంజాబ్ లో అన్ని రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో పంజాబ్ రాజకీయాలు కాక రేపుతున్నాయి. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ (Congress)ను వీడి కొత్త పార్టీ పెట్టుకున్న రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ కారణంగా కాంగ్రెస్ ఇబ్బందులు ఎదర్కొంటున్నది. ఈ క్రమంలోనే హస్తం కీలక నేత కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాడు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్ (Congress) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, కీలక నేత హస్తానికి గుడ్ బై చెప్పాడు. కాంగ్రెస్ నేత జస్బీర్ సింగ్ ఖంగుర (Jasbir Singh Khangura) ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. కాగా, చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ బలంగా నిలుస్తున్న ఆయన జస్పీర్ కుటుంబం కాంగ్రెస్‌కు దూరంగా జరగడం ఆ పార్టీకి పెద్ద బెబ్బ తగిలినట్టే అని చెప్పాలి. సోనియా గాంధీకి పంపిన లేఖలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జస్బీర్ సింగ్ ఖంగుర పేర్కొన్నారు. అలాగే, పార్టీ కోసం తన తండ్రి 60 ఏండ్లు, తాను 20 సంవత్సరాలు సేవ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నుంచి ఇంతకాలం పాటు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్న జస్పీర్ సింగ్ ఖంగర.. రాజీనామాకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
కాగా, జస్బీర్ సింగ్ ఖంగుర (Jasbir Singh Khangura) గతంలో ఖిలా రాయ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు అసెంబ్లీ టికెట్ నిరాకరించింది. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతోనే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. ఇదిలావుండగా, పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు (Punjab Assembly Election 2022) ఫిబ్రవరి 20 నుంచి జరగున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికలు దగ్గరపడిన సమయంలో జస్బీర్ సింగ్ ఖంగురా రాజీనామా చేయడం కాంగ్రెస్ షాక్ తగిలినట్టైంది. ఇదిలావుండగా, పంజాబ్ లో పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కేబినెట్ మంత్రులు మన్ ప్రీత్ సింగ్ బాదల్, పర్గత్ సింగ్ లు శనివారం నాడు తమ నామినేషన్ల పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
కాంగ్రెస్ త్వరలోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి సిద్ధమవుతోంది. కార్యకర్తలు, పార్టీ నేతలు, అగ్రనాయకత్వం సంప్రదింపులు తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ సీఎం అభ్యర్తిని ప్రకటిస్తామని హస్తం వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఊహాగనాలకు తెరదించుతూ.. రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనలో మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చినా అవతలి వ్యక్తి మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, చన్నీ, సిద్ధూలు ఇద్దరూ కూడా వేదికపై ఒకరినొకరు కౌగిలించుకొని పుకార్ల కు ఫుల్‌స్టాప్ పెట్టారు.