జట్టు విజయోత్సవ సంబరాల్లో పాల్టొన్న కర్ణాటక మాజీ క్రికెటర్ కె. హొయసల హాఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో కర్ణాటక తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కర్ణాటక : కర్ణాటక మాజీ క్రికెటర్ కె. హోయసల (34) ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్ తర్వాత అనుకోకుండా గుండెపోటుకు గురయ్యాడు. తమిళనాడుపై తమ జట్టు విజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటుండగా.. గుండెపోటుతో మైదానంలోనే మరణించాడు.
బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఐ క్రికెట్ మైదానంలో తమిళనాడుతో కర్ణాటక మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక విజయం తర్వాత, జట్టుతో కలిసి సంబరాలు చేసుకుంటుండగా, హోయసల తీవ్రమైన ఛాతీ నొప్పితో మైదానంలో స్పృహతప్పి పడిపోయాడు.
వెంటనే అంబులెన్స్‌లో బెంగుళూరులోని బౌరింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద సంఘటన ఫిబ్రవరి 22, గురువారం నాడు జరిగింది. కానీ, ఫిబ్రవరి 23 సాయంత్రం ఈ విషయం వెలుగు చూసింది.
మిడిల్ ఆర్డర్ బ్యాటర్, బౌలర్, హోయసల అండర్-25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. బౌరింగ్ హాస్పిటల్, అటల్ బిహారీ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ మనోజ్ కుమార్ ప్రకారం, క్రికెటర్ చనిపోయాడని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
"హొయసల గుండెపోటు కారణంగానే మృతి చెందాడు. పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలుపుతాం’’ అని డాక్టర్ కుమార్ చెప్పారు.