కర్ణాటక ఉప ఫలితాల ఎఫెక్ట్: సిద్ధరామయ్య రాజీనామా

By sivanagaprasad Kodati  |  First Published Dec 9, 2019, 3:56 PM IST

కర్ణాటకలో ఉపఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత పదవికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు.


కర్ణాటకలో ఉపఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత పదవికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతగా తాను ప్రజాస్వామ్యానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలను పాటించాల్సి ఉంటుందని సిద్ధూ స్పష్టం చేశారు.

పార్టీలోని కొందరి సూచన మేరకు ప్రతిపక్షనేత పదవికి తాను రాజీనామా చేశానని, రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కేసీ వేణుగోపాల్‌, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూ రావుకు పంపారు.

Latest Videos

undefined

Also Read:కర్ణాటక ఉప ఎన్నికలు: 12 చోట్ల బీజేపీ జయభేరీ, చేతులెత్తేసిన కాంగ్రెస్

ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేశానని అయితే ఫలితం మరోలా రావడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. మొత్తం 15 స్థానాల్లో 12 గెలుచుకుని తనకు ఎదురులేదని నిరూపించుకుంది. మరోవైపు, ఉప ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకోవాలని భావించిన కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి.

హస్తం పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచి చేతులేత్తేసింది. సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పిన జేడీఎస్ కనీసం బోణి చేయలేకపోయింది. మరో చోట స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించారు.

Also Read:కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్: ఫలితాలపై ఉత్కంఠ

గోఖక్, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణేబెన్నూరు, హీరెకెరూరు, కేఆర్ పురం, మహాలక్ష్మీ లేఔట్, యశ్వంత్‌పూర్, విజయనగర, కేఆర్  పేట, చిక్కబళ్లాపూర్‌ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా పాతింది.

హణసూరు, శివాజీ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. హోసకోటెలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన బీజేపీ రెబెల్ శరత్ కుమార్ గౌడ విజయం సాధించారు. ఈయన కూడా తిరిగి కమలం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

click me!