మణిపూర్ హింస వెనుక విదేశీ హస్తం ఉండే అవకాశాలు లేకపోలేవని ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) ఎంఎం నరవాణే కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అక్కడ సాయుధ తిరుగుబాటు గ్రూపులకు చైనా నుంచి చాలా ఏళ్లుగా సహకారం అందుతున్నదని, ఇప్పటికీ అందుతున్నదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: మణిపూర్ హింస గురించి ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హింస వెనుక విదేశీ హస్తం ఉన్నదా? అనే విషయాన్ని కొట్టిపారేయలేం అని వివరించారు. హింసకు పాల్పడిన మూకలకు చైనా సహకారం ఇచ్చిందనే విషయాన్నీ కాదనలేం అని తెలిపారు. సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్‌లో అస్థిరత మొత్తం దేశ భద్రతకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు.
ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నేషనల్ సెక్యూరిటీ పర్‌స్పెక్టివ్ అనే అంశంపై మాట్లాడటానికి జనరల్(రిటైర్డ్) ఎంఎం నరవాణే హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ హింసను కట్టడి చేయడానికి.. అధికారంలో ఉన్నవారు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఇదే సందర్భంలో ఆయన విదేశీ పాత్ర గురించి మాట్లాడారు.
విదేశీ సంస్థల జోక్యం ఈ హింస వెనుక ఉన్నదా? అనే విషయాన్ని తానే కాదు చాలా మంది కాదనకుండా ఉన్నారని(రిటైర్డ్) జనరల్ ఎంఎం నరవాణే వివరించారు. అయితే.. తాను చెప్పేదేమంటే.. మణిపూర్‌లో పలు తిరుగుబాటు గ్రూపులకు చైనా నుంచి సహకారం కచ్చితంగా అందుతున్నదని మాత్రం చెబుతాను అని వెల్లడించారు. ఈ గ్రూపులకు చైనా కొన్నేళ్ల నుంచి సహాయం అందిస్తున్నదని తెలిపారు. ఇప్పటికీ అది కొనసాగుతున్నదని అన్నారు.
Also Read: గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. ఎస్ఆర్ఎస్పీ గేట్ల ఎత్తివేత: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మణిపూర్ హింసలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా అనే అంశం గురించి ప్రశ్నించగా.. చాలా కాలం నుంచి అక్కడ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతున్నదని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్(రిటైర్డ్) నరవాణే చెప్పారు. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ మూడు దేశాల సరిహద్దులు కలిసే గోల్డెన్ ట్రయాంగిల్‌కు మనం కొంత దూరంలోనే ఉన్నామని గుర్తు చేశారు. మయన్మార్‌లో ఎలాంటి ప్రభుత్వం ఉన్నా ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో పెద్దగా నియంత్రణ ఉండదని వివరించారు. అది ఇండియా, చైనా, థాయ్‌లాండ్ సరిహద్దు ప్రాంతాల్లోనూ మయన్మార్ ప్రభుత్వానికి పెద్దగా పట్టు ఉండదని, కాబట్టి, డ్రగ్ ట్రాఫికింగ్ అనేది ఎప్పటికీ అక్కడ ఉంటూనే ఉన్నదని తెలిపారు.