మందుబాబులు.. జాగ్రత్త! ఇంట్లో నాలుగు ‘బాటిళ్లు’ మించొద్దు.. లేదంటే లిక్కర్ లైసెన్స్ తీసుకోవాల్సిందే

By telugu teamFirst Published Sep 25, 2021, 5:44 PM IST
Highlights

ఇంట్లో నెలకు సరిపడా సరుకు లేదా ప్రత్యేకంగా హోమ్ బార్ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రత్యేకంగా హోం బార్ లైసెన్స్ తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చట్టం తెచ్చింది. నాలుగు బాటిళ్ల వరకైతే ఓకే. అంతకు మించితే మాత్రం లైసెన్స్ తప్పనిసరి అని ఆ చట్టం చెబుతున్నది.

లక్నో: మందుబాబులకు మత్తువదిలే హెచ్చరిక. డబ్బులున్నాయి కదా అని వైన్స్ నుంచి నెలకు సరిపడా ‘సరుకు’ కొనుక్కోవాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో నాలుగు బాటిళ్లకు మించి మద్యం ఉండొద్దని తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు బాటిళ్లకు మించి నిల్వ చేసుకోవాలనుకుంటే ప్రత్యేకంగా అందుకోసం లిక్కర్ లైసెన్స్ తీసుకోవాలని చట్టం తెచ్చింది.

ఉత్తరప్రదేశ్ చట్టం కొత్త చట్టం తెచ్చింది. ఈ నెల 23 నుంచే అది అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం, ఇంట్లో నాలుగు కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు నిల్వ చేసుకోవాలనుకుంటే హోమ్ లిక్కర్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నాలుగింటిలోనూ రెండు ఫారీన్ బ్రాండ్‌లు, రెండు ఇండియన్ బ్రాండ్లు ఇంట్లో నిల్వ చేసుకోవడానికి అవకాశముంది. లైసెన్స్ తీసుకుంటే గరిష్టంగా 72 బాటిళ్లు నిల్వ చేసుకోవచ్చు. ఇందులోనూ 15 రకాల కేటిగిరీలున్నాయి.

వైన్ షాపుల నుంచి ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేయాలన్న వినియోగదారులు ఈ హోం బార్ లైసెన్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ కోసం జిల్లా అబ్కారీ అధికారి దగ్గర దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్స్‌కు ఏడాది ఫీజు రూ. 12వేలు. ష్యూరిటీ డిపాజిట్‌గా రూ. 51వేలు సమర్పించాల్సి ఉంటుంది.

click me!