
కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ రెండు రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కేసుల తీవ్రతను తగ్గించడానికి గాను నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు మరికొన్ని కీలక చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని కోవిడ్ పరిస్ధితిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షించారు. అనంతరం ఆయన ఈ మేరకకు సూచనలు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్, టీకా డ్రైవ్‌లు, కోవిడ్‌పై స్పందన వంటి చర్యల ద్వారా వ్యాప్తి ఎక్కువగా వున్న ప్రాంతాలపై అదనంగా దృష్టి పెట్టాలని హోంశాఖ సూచించింది. అలాగే రాష్ట్రాలకు అదనపు టీకాల సరఫరాపైనా హోంశాఖ హామీ ఇచ్చింది. దేశంలో ఇప్పటి వరకు 61 కోట్లకు పైగా డోసులను అందించినట్లు తెలిపింది. అర్హత వున్న పెద్దలలో సగం మందికి పైగా కనీసం ఒక డోస్‌ను అందించినట్లు కేంద్రం వెల్లడించింది.
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు మధ్యలో దేశంలో కేసుల సంఖ్య ఐదు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే గడిచిన వారం నుంచి దాదాపు 60 శాతం కొత్త కేసుల పెరుగుదలతో పాటు యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేరళ ఈ విషయంలో అగ్రస్థానంలో వుంటే.. ఆతర్వాత మహారాష్ట్ర వుంది.
Also Read:ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు: కేరళలోనే 30 వేల కేసుల నమోదు
ఇక కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షా సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం), ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజ్ డైరెక్టర్ (ఎన్‌సిడిసి) మరియు కేరళ మరియు మహారాష్ట్ర ముఖ్య కార్యదర్శులు మరియు డైరెక్టర్ల జనరల్ డాక్టర్ వికె పాల్ పాల్గొన్నారు. ఇకపోతే భారతదేశంలో శుక్రవారం 44,658 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3,26,03,188కి చేరుకుంది. అలాగే కొత్తగా 496 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాలు 4,36,861కి చేరుకున్నాయి.