అసోంలో ట్రక్కులపై మిలిటెంట్ల కాల్పులు, నిప్పు: ఐదుగురు సజీవ దహనం, ఒకరికి గాయాలు

By narsimha lodeFirst Published Aug 27, 2021, 11:49 AM IST
Highlights

అసోం రాష్ట్రంలోని దిమా హాసావో జిల్లాల్లో గురువారం నాడు రాత్రి మిలిటెంట్లు ట్రక్కులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

డిస్‌పూర్: అసోం రాష్ట్రంలోని దిమా  హాసావో జిల్లాలో గురువారం నాడు రాత్రి మిలిటెంట్లు ఐదు ట్రక్కులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు సజీవ దహనమయ్యారు.ఈ ఘటనలో ఒకరు తీవ్ర గాయాలతో  బయటపడ్డాడు.అసోం రాష్ట్రంలోని సెంట్రల్ అస్సోంలోని కొండ జిల్లా దిమా హసావోలోని దియుంబ్రాలో చోటు చేసుకొంది. దగ్దమైన ఐదు ట్రక్కుల నుండి ఐదు మృతదేహాలను వెలికితీశారు.గాయపడిన మరో వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన గురువారం నాడు రాత్రి 9 గంటల సమయంలో చోటు చేసుకొంది. ఓ ప్రైవేట్ సిమెంట్ కంపెనీ కోసం ఐదు ట్రక్కులు బొగ్గు, కంకరను తీసుకెళ్తున్న సమయంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపి ఆ తర్వాత నిప్పు పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు.

దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్ఎల్ఏ) అనే మిలిటెంట్ గ్రూప్ ఈ దాడి వెనుక ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అస్సాంలోని గిరిజనులలో దిమాసాలకు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్  చేస్తున్నారు.దాడి చేయడానికి ముందు సిమెంట్ కంపెనీల నుండి డబ్బులు డిమాండ్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మే మాసంలో డిఎన్ఎల్ఏలోని ఏడుగురు సభ్యులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

click me!