సముద్ర తీరంలో ఈదురు గాలుల బీభత్సం.. 8 మంది మత్స్యకారుల గల్లంతు..

By team teluguFirst Published Dec 2, 2021, 5:13 PM IST
Highlights

సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. రాకాసి అలలు ఎగసిపడ్డాయి. సముద్ర తీరానికి సమీపంలో లంగరు వేసిన మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. ఈ  ఘటనలో 8 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.
 

సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఓ వైపు భారీ వర్షం, ఈదురు గాలులు.. మరోవైపు రాకాసి అలలు ఎగసిపడ్డాయి. సముద్ర తీరానికి సమీపంలో లంగరు వేసిన మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. 10 పడవలు సముద్రంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ  ఘటనలో 8 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ జిల్లా ఉనా తాలూకాలో చోటుచేసుకుంది. వివరాలు బుధవారం నుంచి దక్షిణ గుజరాత్ (Gujarat) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలులు వీస్తున్నాయి. 

అయితే గిర్- సోమనాథ్ (Gir Somnath) తీరం సమీపంలో బలమైన గాలులకు అలలు ఎగసిపడటంతో.. పడవలు సముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సిబ్బంది వెంటనే ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్  ప్రారంభించారు. గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  కోస్ట్ గార్డ్ వెంటనే ఆ ప్రాంతంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. అంతేకాకుండా నేవీ సాయం కూడా తీసుకుంది. రెండు హెలికాఫ్టర్లతో (helicopters).. గల్లంతైన మత్స్యకారులను ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 

తప్పిపోయిన ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం గురువారం తెల్లవారుజామున కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఉనా తాలూకాలోని రెవెన్యూ అధికారి ఆర్ ఆర్ ఖంబ్రా పిటిఐకి తెలిపారు. ‘నవబందర్ గ్రామంలో అర్ధరాత్రి తర్వాత బలమైన గాలులు, సముద్రపు అలల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. మొదట్లో 12 మంది మత్స్యకారుల జాడ తెలియలేదు.. అయితే వారిలో నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు, ఎనిమిది మంది తప్పిపోయారు. మేము రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాము’ అని ఖాంబ్రా చెప్పారు.

మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. భారీ వర్షాలు కురవడంతో పాటుగా, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Also read: Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరో వానగండం.. దూసుకొస్తున్న తుఫాన్

ఇక, దక్షిణ గుజరాత్‌ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మూడు డిగ్రీలకు తగ్గాయి. ఈ క్రమంలో డయ్యూ ప్రాంతంలో కూడా పడవ మునిగిపోవడం కారణంగా ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. 

click me!