
UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యూపీలో (Uttar Pradesh) లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మౌలో జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఎస్పీ కూటమి అభ్యర్థి అబ్బాస్ అన్సారీ మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురిచేసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
వివరాల్లోకెళ్తే.. మార్చి 7న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడో దశ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బాహుబలి ముఖ్తార్ అన్సారీ తనయుడు అబ్బాస్ అన్సారీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కేసులో ఇరుక్కున్నాడు. ఓం ప్రకాష్ రాజ్‌భర్ పార్టీ సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ బండా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ కుమారుడిని మౌ నుంచి పోటీకి దింపింది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించిన అబ్బాస్ అన్సారీ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ అధికారులు, పోలీసులను బెదిరింపులకు గురిచేసే విధంగా వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అబ్బాస్ అన్సారీపై కేసు నమోదు చేయడంతో పాటు, వీడియోపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అబ్బాస్ అన్సారీకి మద్దతుగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా శుక్రవారం మౌలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఉత్తరప్రదేశ్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ మౌలో జరిగిన సమావేశంలో అబ్బాస్ అన్సారీ రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన వీడియోపై విచారణకు ఆదేశించారు. వీడియోపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మౌ పోలీసులను ప్రశాంత్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కూటమి అభ్యర్థిగా మౌ సదర్ నుంచి అబ్బాస్ అన్సారీ పోటీ చేస్తున్నారు. ఎస్పీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బాస్ అన్సారీ ఏడీజీ సూచనల మేరకు బహిరంగ ర్యాలీలో చేసిన వివాదాస్పద ప్రకటనపై మౌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించి రిటర్నింగ్ అధికారికి నివేదిక కూడా అందించారు.
గురువారం నాడు నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అబ్బాస్ అన్సారీ ఈ ఎన్నికల్లో విజయం సాధించి సమాజ్‌వాదీ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. అలాగే, ఆయన యూపీ, పోలీసులు, అధికారులను బెదిరించడం కనిపించింది. "ఆరు నెలల వరకు ఎలాంటి బదిలీలు లేదా పోస్టింగ్‌లు జరగవని నేను ఎస్‌పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు చెప్పాను. మొదట, వారితో 'హిసాబ్ కితాబ్' జరుగుతుంది. అప్పుడే వారి బదిలీ సర్టిఫికేట్‌లపై ముద్ర వేయబడుతుంది" అని ఆయన అన్నారు. ఎవరు ఎది చేసినా.. అది అలాగే ఉంటుందనీ, ప్రతిదానికి లెక్క ఇక్కడే సరిచేస్తామనీ, ఎస్పీ ప్రభుత్వం ఏర్పడితేనే అధికారులు మంచిగా వ్యవహరిస్తారంటూ బెదిరింపులకు గురిచేసే విధంగా వ్యాఖ్యానించారు.