
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప (Naveen Shekharappa) మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటకలోని హవేరి జిల్లాలోని నవీన్ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతుంది. కొడుకు అఖిరి చూపైనా దక్కుతుందా అని నవీన్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. నవీన్ మృతదేహాన్ని ప్రభుత్వం ఎలాగైనా స్వదేశానికి తీసుకువస్తారనే ఆశతో అతని కుటుంబం ఎదురుచూస్తుంది. అయితే ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్దం జరుగుతున్నందన.. అక్కడికి ఇప్పుడు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నవీన్ మృతదేహాన్ని స్వగ్రామానికి ఎప్పుడు తీసుకువస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘విమానంలో మృతదేహం ఎక్కువ స్థలాన్ని అక్రమిస్తుంది’ అంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కర్నాటకలోని హుబ్లీ-ధార్వాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ మాట్లాడుతూ.. శవపేటికకు బదులుగా.. దాదాపు ఎనిమిది నుండి 10 మందిని విమానంలో ఉంచవచ్చని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
‘నవీన్ మృతదేహాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతం.. అందరికీ దాని గురించి తెలుసు. ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలైతే మృతదేహాన్ని తిరిగి తీసుకువస్తాము. బతికి ఉన్నవారిని స్వదేశానికి తిరిగి తీసుకురావడం చాలా సవాలుగా మారింది.. చనిపోయిన వారిని తిరిగి తీసుకురావడం మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే మృతదేహం విమానంలో ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుంది. మృతదేహానికి బదులుగా 8 నుంచి 10 మందిని తీసుకురావచ్చు’ అని అరవింద్ బెల్లాడ్ వ్యాఖ్యానించారు. నవీన్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
నవీన్ మృతదేహాన్ని రెండు రోజుల్లో ఇంటికి తీసుకువస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నవీన్ తండ్రి శేఖరప్ప జ్ఞానగౌడ (Shekharappa Gyanagowda) బుధవారం ఓ ఆంగ్ల మీడియా సంస్థకు చెప్పారు. తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా తాను ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించినట్లు ఆయన తెలిపారు.
ఇక, కర్ణాటకలోని హవేరి జిల్లాలోని చెలగేరికి చెందిన నవీన్ ఖర్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. అయితే రష్యా దాడుల నేపథ్యంలో ఖర్కివ్‌లోని ఓ బంకర్‌లో ఉండిపోయిన నవీన్.. మంగళవారం సరుకులు కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన సమయంలో జరిగిన షెల్లింగ్‌లో మృతిచెందాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ నవీన్ కుటుంబానికి తెలియజేసింది. నవీన్ మృతిచెందాడనే విషయం తెలియగానే అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు నవీన్ కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.