
Delhi Rail Godown: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ప్రతాప్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని సబ్జీ మండి వద్ద రైల్వే గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. మొత్తం 14 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అదుపులోకి వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది.
అగ్నిప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రతాప్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని సబ్జీ మండి వద్ద ఉన్న రైల్వే గోడౌన్‌లో సాయంత్రం 4:25 గంటలకు మంటలు చెలరేగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే 14 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి తరలించామని తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదన్నారు.
తొలుత రెండు ఫైరింజన్లు పంపించారు. అటుపై ఏడు.. తర్వాత మరో ఏడుగు ఫైరింజన్లు పంపించినట్లు అగ్ని మాపక దళ అధికారులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పివేశాయి. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో నల్లని మబ్బులు ఈ ప్రాంతాన్ని కమ్మేశాయి. ప్రమాద కారణాలు తెలియకున్నా.. భారీ నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.