
న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని ఓ హెటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇవాళ ఉదయం ఏడున్నర గంటల సమయంలో ద్వారక హోటల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
ద్వారకా హోటల్‌లో ఇవాళ ఉదయం ఏడు గంటల 40 నిమిషాలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని సమాచారం రావడంతో 8 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు సంఘటనస్థలానికి చేరుకొన్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అనిల్ గార్గ్ చెప్పారు.
ఈ భవనం జార్ఖండ్ రాంచీకి చెందిన సిద్దార్ద్, కరుణకు చెందింది. అయితే ద్వారకాలోని సెక్టార్ 8లో శ్రీకృష్ణ ఓయో హోటల్ ను సురత్ గుప్తా నిర్వహిస్తున్నాడు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొనే సమయానికి హోటల్ సిబ్బంది ఎవరూ లేరని పోలీసులు చెప్పారు. మంటలను ఆర్పివేసిన తర్వాత మెట్లపై ఓ మహిళ సహా రెండు మృతదేహాలు కన్పించాయి. ఈ డెడ్‌బాడీలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు.
అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, ఆ తర్వాత అరగంటకే విద్యుత్ సరఫరా పునరుద్దరించినట్టుగా ప్రత్యక్ష సాక్షి లోకేష్ పోలీసులకు చెప్పారు.ఇవాళ ఉదయం 7 గంటలకు తాను నిద్ర లేచే సమయానికి హోటల్ నిండా పొగ కమ్ముకొందని ఆయన చెప్పారు. తాను విద్యుత్ వైర్లలో మంటలను కూడ చూశానని ఆయన చెప్పారు.ద్వారకా హోటల్‌లో అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టుగా ద్వారా సౌత్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ సంతోష్ కుమార్ మీనా చెప్పారు.