పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ‘దొంగ’ సన్యాసి అవతారం.. 26ఏళ్ల తర్వాత అరెస్టు

By telugu teamFirst Published Aug 15, 2021, 3:20 PM IST
Highlights

26ఏళ్లుగా ఓ దొంగ సన్యాసి అవతారమెత్తి పోలీసుల కళ్లుగప్పాడు. 1995లో చేసిన చోరీకి గాను ఆ దొంగను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దొంగ రూపురేఖలు మారిపోవడంతో స్థానికుల సహాయంతో ధ్రువీకరించుకోవాల్సి వచ్చింది.

అహ్మదాబాద్: గుజరాత్‌లోని సూరత్ పోలీసులు ఓ దొంగ సన్యాసి అసలురూపాన్ని బట్టబయలు చేశారు. 1995లో దొంగతనం చేసి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి 26ఏళ్లుగా సన్యాసి అవతారాన్ని వేసినా పోలీసులు పట్టుకున్నారు. దొంగ రూపురేఖలు మారినా స్థానికుల సహాయంతో ధ్రువీకరించుకుని అరెస్టు చేశారు. 

భావ్‌నగర్‌లోని విర్దీ గ్రామానికి చెందిన భోలా పటేల్ రెండు దేశాబ్దాల క్రితం మాంజీ పటేల్ దగ్గర పనిలో కుదిరాడు. మాంజీ పటేల్‌ వీడియో రెంటల్ సర్వీస్ బిజినెస్ నిర్వహించేవాడు. అందులోనే భోలా పటేల్ పనిచేశాడు. 1995లో ఓ క్లయింట్‌కు టీవీ సెట్, వీడియో క్యాసెట్ ప్లేయర్(వీసీపీ), మూడు వీడియో క్యాసెట్‌లను డెలివరీ చేయడానికి భోలా పటేల్‌ను యజమాని పురమాయించాడు. వాటిని తీసుకుని బయల్లేరిన భోలా పటేల్ క్లయింట్‌కు వాటిని డెలివరీ చేయలేదు, మళ్లీ తిరిగి రాలేదు. ఆ పరికరాలు రూ. 12వేల విలువైనవి. 

ఈ దొంగతనంపైనే భోలా పటేల్‌పై కేసు నమోదైంది. ఆ ఎలక్ట్రానిక్ వస్తువులను భోలా పటేల్ అమ్ముకున్నాడు. అనంతరం తిరిగి స్వగ్రామం విర్దీకి చేరుకున్నాడు. కానీ, బయట కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీసులు ఆ గ్రామానికి తనిఖీల కోసం వచ్చినప్పుడు అక్కడి నుంచి పరారయ్యేవాడు. మళ్లీ స్వస్థలానికి వచ్చేవాడు. ఇలా కొంత కాలం గడిచింది. తర్వాత పోలీసుల దర్యాప్తు తీవ్రత పెరగడంతో ఊరు వదిలిపెట్టాలని భోలా పటేల్ నిర్ణయించుకున్నాడు. పోలీసుల కళ్లుగప్పడానికి సన్యాసి అవతారాన్ని ఆశ్రయించాడు.

కుటుంబ సభ్యులను వదిలి సన్యాసి అవతారమెత్తిన భోలా పటేల్ ఎక్కువగా ఆలయాలు, ఆశ్రమాల్లో గడిపాడు. పోలీసులకు అనుమానం రాకుండా నిష్ఠగల సన్యాసిలా వ్యవహరించేవాడు. అయినప్పటికీ కనీసం ఏడాదికి ఒకసారైనా సూరత్‌కు వచ్చి తన కుటుంబ సభ్యులను కలుస్తుండేవాడు. అయితే, ఈ ట్రిప్‌ల గురించి కుటుంబ సభ్యుల బయటకూ పొక్కింది. వీరి ద్వారానే పోలీసులకు సమాచారం వెళ్లింది.

ఇలాంటి ఒక ట్రిప్‌లోనే పోలీసులు భోలా పటేల్‌ను పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్నారు. కానీ, 26ఏళ్ల తర్వాత అతనిని గుర్తుపట్టడం పోలీసులకు కష్టసాధ్యమైంది. స్థానికుల సహాయంతో భోలా పటేలే ఆ దొంగ సన్యాసి అని పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ప్రస్తుతం భోలా పటేల్ పోలీసుల అదుపులో ఉన్నారు.

click me!