ఇదేం పిచ్చి లోకం.. ఫైన్‌లు, ఫైట్లు! 300ఫైన్ కోసం నాలుగు తరాలుగా గొడవలు.. వేలకు పెరిగిన జరిమానా.. తెగని పంచాయతీ

By Mahesh KFirst Published Jan 31, 2023, 2:24 PM IST
Highlights

గుజరాత్‌లోని ఓ తెగకు చెందిన రెండు కుటుంబాలు గత నాలుగు తరాలుగా గొడవ పడుతూనే ఉన్నాయి. తమకు రావాల్సిన జరిమానా చెల్లించాలని గొడవ పెట్టుకుని కొత్త జరిమానాను కూడగట్టుకుంటున్నాయి. ఆరు దశాబ్దాల కింద మొదలైన ఈ శత్రుత్వానికి మొదలు ఏమిటి? ఇప్పుడు ఎంత జరిమానా చెల్లించాలి? అనే విషయంపైనా ఎవరికీ అవగాహన లేదు. కానీ, ఫైన్లు, ఫైట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
 

అహ్మదాబాద్: అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందో తెలియదు. ఫైన్ ఎవరు వేశారో తెలియదు. కానీ, వాటిని చెల్లించాలని ఎదుటి పక్ష దాడి చేయడం, దాడి చేసినందుకు పంచాయితీ పెట్టడం, మళ్లీ ఫైన్లు వేసుకోవడం.. ఫైన్లు ఇవ్వడం లేదని ఘర్షణ పడటం.. ఇదీ ఓ రెండు కుటుంబాల మధ్య వారసత్వంగా కొనసాగిస్తున్న గొడవల పరంపర. ఇదేం పిచ్చిమాలోకం అనుకుంటున్నారా? ఇదంతా వట్టి అబద్ధం అని భావిస్తున్నారా? నిజంగా నిజం ఇది. గుజరాత్‌ అహ్మదాబాద్ పోషినా తాలూకా సబర్కాంత గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ గొడవ ఆరు దశాబ్దాల కిందటిది. దుంగరి భీల్ తెగకు చెందిన రెండు కుటుంబాల మధ్య ఓ గొడవ జరిగింది. అదేమిటనేదీ తెలియదు. కానీ, 1960లలో హర్ఖా రాథోడ్, జెథా రాథోడ్ అనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇందుకు తెగ పెద్దలు ఓ తీర్పు ఇచ్చారు. జెథా కుటుంబానికి హర్ఖా కుటుంబం రూ. 300 జరిమానాగా ఇవ్వాలని తేల్చింది. అంతే.. గొడవతో మొదలైన ఆ జరిమానా నాలుగు తరాలుగా గొడవ కొనసాగడానికి మూలంగా ఉన్నది. 

తమకు రావాల్సిన జరిమానా చెల్లించాలని జెథా కుటుంబం.. హర్ఖా కుటుంబంపై దాడి చేయడం.. వారు తిరిగి దాడి చేయడం, మళ్లీ గొడవ పెట్టుకున్నందుకు ఇద్దరిపై జరిమానాలు పడటం, ఇలా దాడులు.. జరిమానాలు మూడు పూవులు, ఆరు కాయలుగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, నాలుగో తరం కూడా ఈ జరిమానా చుట్టే దాడులు చేసుకుంది.

కొండ ప్రాంతంలో నివసించే ఈ తెగ పెద్ద ఒకరు గతేడాది దీపావళి వేడుకల్లో వీరి జరిమానాలను వెల్లడించారు. హర్ఖా కుటుంబం రూ. 25 వేల జరిమానాను జెథా కుటుంబానికి చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. ఈ డబ్బు చెల్లించాలని హర్ఖా మనవడు వినోద్, ఆయన భార్య చంపా, వారి కుమారుడు కాంతిలను జనవరి తొలి వారంలో జెథా ఇద్దరు కొడుకులు దాడి చేశారు.

Also Read: తన బేబీకి రోడ్డు ఎలా క్రాస్ చేయాలో నేర్పిస్తున్న ఏనుగు.. వీడియో వైరల్

జనవరిలో వీరి గొడవ తొలిసారి పోలీసుల వద్దకు చేరింది. ఇది మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తాజా గొడవ తర్వాత ఇరు కుటుంబాలను కాంప్రమైజ్ చేయడంలో పెద్దలు విఫలం అయ్యారు. తాజా గొడవలో దాడికి గురైన చంపా మాట్లాడుతూ, ‘నా మామా లూకా (హర్ఖా మనవడు) డబ్బును చెల్లించాడు. ఆ తర్వాత వినోద్, కాంతిలు కూడా వివాదాన్ని ముగించుకోవడానికి రూ. 10 వేల నుంచి 15 వేల వరకు చెల్లించారని వివరించారు.

పూర్వం తమ కుటుంబాల మధ్య ఏం గొడవ జరిగిందో ఎవరికీ తెలియదని, ఎవరికీ గుర్తు లేదని, అయినా గొడవ మాత్రం తరాలుగా కొనసాగుతున్నదని, ఈ జరిమానాలు చెల్లించడానికి తాము బాధ పడుతూనే ఉన్నామని ఆమె తెలిపారు. కాగా, జెథా కొడుకు భరత్, ఆయన మనవడు అరవింద్‌లు కూడా రూ. 10 వేల నుంచి 15 వేల వరకు చెల్లించినట్టు చెబుతున్నారని పోలీసు అధికారి తెలిపారు. గొడవ ఏమిటనేది? ఎంత చెల్లించాలనేది కూడా ఎవరికీ తెలియదని వివరించారు. కానీ, రెండు కుటుంబాలు జరిమానా చెల్లించాలని గొడవ పడుతూనే ఉన్నాయని, ఎంత చెల్లించాలనేది కూడా ఎవరికీ తెలియదని చెప్పారు.

click me!