Omicron: ఐదో వేవ్ ముంగిట్లో ఢిల్లీ: హెల్త్ మినిస్టర్ వార్నింగ్

By Mahesh KFirst Published Jan 5, 2022, 12:40 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఐదో వేవ్ వస్తున్నదని అన్నారు. ఈ రోజు కేసులు ఢిల్లీలో పది వేలను దాటే అవకాశం ఉన్నదని తెలిపారు. కేసులు పెరుగుతున్నా.. హాస్పిటల్‌లలో చేరుతున్న వారి సంఖ్య మాత్రం స్వల్పంగానే ఉన్నదని అన్నారు.
 

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ కరోనా వైరస్ వ్యాప్తి గురించి మాట్లాడారు. దేశమంతా మూడో వేవ్ ఎదుర్కొనే దశలో ఉండగా.. ఢిల్లీ ఐదో వేవ్(Fifth Wave) ముంగిట్లో ఉన్నదని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ(Delhi)లో ఐదో వేవ్ కమ్ముకొచ్చే ముప్పు ఉన్నదని ఆయన జనవరి 5వ తేదీన ధ్రువీకరించారు. ఈ రోజు (బుధవారం) ఢిల్లీలో కరోనా కేసులు పది వేల మార్క్‌ను దాటే అవకాశం ఉన్నదని వివరించారు. పాజిటివిటీ రేటు పది శాతాన్ని దాటనుందని తెలిపారు. అయితే, కేసులు పెరుగుతున్నా.. హాస్పిటల్‌లలో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య స్వల్పంగానే ఉన్నదనే ఉపశమనకర విషయాన్ని వెల్లడించారు.

కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన హెచ్చరిస్తూ ఢిల్లీ వాసులు తప్పకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తున్నదని అన్నారు. కరోనా పేషెంట్లలో లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, వ్యాధి తీవ్రత కూడా స్వల్పంగానే ఉన్నదని తెలిపారు. అయినప్పటికీ కొవిడ్ రూల్స్ మాత్రం తప్పకుండా పాటించాలని వివరించారు. దేశం మూడో వేవ్‌ను ఎదుర్కొంటున్నదని అన్నారు. కానీ, ఢిల్లీలో మాత్రం నాలుగు వేవ్‌లు ముగిశాయని, ఐదో వేవ్ వస్తున్నదని హెచ్చరించారు. అందుకే హాస్పిటల్స్‌లో పడకల సంఖ్యను పెంచడానికి కసరత్తులు చేస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు హాసపిటళ్లలోనూ కొవిడ్ బెడ్స్‌ను పది శాతం నుంచి 40 శాతానికి పెంచాలని సూచించినట్టు వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లలో కేవలం ఐదు శాతం పడకలు మాత్రమే పేషెంట్లతో నిండాయని చెప్పారు. ఇదే సందర్భంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించీ మాట్లాడారు. కేజ్రీవాల్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపారు. ఇప్పటికీ ఐసొలేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు.

Also Read: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్క రోజే 58 వేలకు పైగా కొత్త కేసులు.. 2 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 58,097 Covid కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్ విడుదల చేసింది. అయితే ఇవి క్రితం రోజుతో పోల్చితే 55 శాతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక, కరోనాతో మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,551కి చేరింది. నిన్న కరోనా నుంచి 15,389 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,43,21,803కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,14,004 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో రోజువారీ పాజివిటీ రేటు 4.18 శాతంగా ఉంది.

Also Read: కీలక ముందడుగు.. భారత్‌ బయోటెక్‌ నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా పరీక్షించడానికి DCGI అనుమతి..

మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారత్‌లో భారీగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 828 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653 నమోదయ్యాయి. ఆ తర్వాత 464 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

click me!