
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ అభివృద్ది చేసిన చుక్కల మందు టీకాను (nasal COVID-19 vaccine) బూస్టర్ డోస్‌గా పరీక్షించడగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఆమోదం తెలిపింది. భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు అవసరమైన చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతిని మంజూరు చేసింది. భారత్ బయోటెక్‌కి ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ఫేజ్ 3 సుపీరియారిటీ స్టడీ, ఫేజ్ 3 బూస్టర్ డోస్ స్టడీ నిర్వహణ కోసం DCGI సబ్జెక్ట్ నిపుణల కమిటీ సూత్రప్రాయంగా అనుమతులు మంజూరు చేసింది. ఆమోదం కోసం ప్రోటోకాల్‌లను సమర్పించాలని భారత్ బయోటెక్‌ను ఆదేశించింది.
ఇక, ముక్కు ద్వారా ఇచ్చే ఈ టీకాను బూస్టర్ డోస్ గా ఇవ్వొచ్చని భారత్ బయోటెక్ సంస్థ చెబుతోంది. కొవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు, బూస్టర్ డోస్‌గా ఇచ్చేందుకు ఇది అనువైనది పేర్కొంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించి క్లినికల్ పరీక్షలు నిర్వహణకు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ ఇటీవల డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. దాదాపు 5 వేల మంది వాలంటీర్లపై ఈ పరీక్షలను నిర్వహించనుంది. దీని ఫలితాల ఆధారంగా అత్యవసర వినియోగ అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్క రోజే 58 వేలకు పైగా కొత్త కేసులు.. 2 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
ఇక, భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ టీకాను 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు అత్యవసర వినియోగానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక, ప్రస్తుతం దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. వారికి కొవాగ్జిన్ టీకాను అందజేస్తున్నారు.