గుజరాత్ లో సెల్ ఫోన్ గొడవ... కొడుకుపై కన్నతండ్రి కాల్పులు

By Arun Kumar PFirst Published Aug 21, 2022, 9:18 AM IST
Highlights

సెల్ ఫోన్ విషయంతో తలెత్తిన వివాదంలో ఓ మైనర్ కోడుకు తండ్రిపై దాడికి దిగగా.... కోపంతో ఊగిపోయిన తండ్రి కొడుకుపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 

గాంధీనగర్ : సెల్ ఫోన్... ప్రపంచాన్ని మన గుప్పిట్లో వుంచే ఓ అద్భుత సాధనం. ప్రస్తుత కాలంలో మనిషికి కూడు, గూడు, గుడ్డ మాత్రమే కాదు సెల్ ఫోన్ కూడా నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయింది.  దీనికి మనిషి ఎంతలా బానిసయ్యారో తెలియజేసే సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. సెల్ ఫోన్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తి చివరకు కాల్పులకు తెగబడే స్థాయికి చేరింది. తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి తీవ్రంగా గాయపర్చుకుని ఇద్దరూ హాస్పిటల్ పాలయ్యారు.  
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లా కామ్రేజ్ సమీపంలోని వమ్ గ్రామానికి చెందిన ఓంప్రకాష్ నకియా భారత ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం అతడు సూరత్ లోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వమ్ గ్రామంలోనే చంద్ర దర్శన్ సొసైటీలో భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.  

read more  అక్రమసంబంధానికి అడ్డుగా వున్నాడని... ప్రియుడితో కలిసి భర్తను కాల్చిచంపిన వివాహిత

రోజూ ఉదయం పనికి వెళ్లే ఓంప్రకాష్ రాత్రి ఇంటికి వచ్చేసరికి 15ఏళ్ల కొడుకు సెల్ ఫోన్ తో కనిపించేవాడు. ప్రతిరోజూ ఇలాగే కొడుకు సెల్ ఫోన్ చూస్తూ కనిపించడంతో అతడికి కోపం తెప్పించింది. అంతలా మొబైల్ చూస్తుంటే ఏం చేస్తున్నావంటూ భార్యను తిట్టాడు. అలాగే చదువుకోకుండా సెల్ ఫోన్ తో ఈ ఆటలేంటని కొడుకును కూడా మందలించేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే తనగురించే తల్లితో గొడవపడ్డ తండ్రిపై కోపంతో రగిలిపోయిన తనయుడు దారుణంగా వ్యవహరించాడు. తండ్రిని ఓ కర్రతో రక్తం వచ్చేలా అతి దారుణంగా చితకబాదాడు. 

తనపై దాడిచేసిన కొడుకుపై ఆ తండ్రి కూడా కోపంతో ఊగిపోయాడు. తన లైసెన్స్ గన్ తో కొడుకుపై కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా బుల్లెట్లు యువకుడి రెండు మోచేతుల్లోకి దూసుకెళ్లారు. ఇలా తండ్రి చేతిలో కొడుకు, కొడుకు చేతిలో తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. 

తండ్రీకొడుకుల గొడవ, కాల్పులపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఓంప్రకాష్ కొడుకుపై కాల్పులకు దిగిన గన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తండ్రీకొడుకు ఇద్దరూ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

click me!