పచ్చని సంసారంలో రమ్మీ చిచ్చు.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

By Siva KodatiFirst Published Aug 6, 2021, 7:35 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రం హోసూరులో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. దీనికి కారణం ఆన్‌లైన్ రమ్మీ గేమ్.
 

సరదా కోసమో లేక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యమో కానీ ఆన్ లైన్ గేమ్స్‌కు ఇటీవల విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనికి తోడు లాక్‌డౌన్ పుణ్యమా అని ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. అయితే ఇలాంటి వాటిని ఆడొద్దు..ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని పోలీసులు, ఇతరులు ఎంత మొత్తుకొని చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల బాధతో తనువు చాలిస్తున్నారు. వారు చనిపోవడమే కాకుండా…కుటుంబసభ్యులను కూడా ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిని కల్పిస్తున్నారు. తాజాగా..తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా హోసూరులో మోహన్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఇతనికి తల్లి వసంత (61), భార్య రమ్య (36), కొడుకు అన్వయ్ (10) ఉన్నారు. అయితే…మోహన్ కు ఆన్ లైన్ లో గేమ్స్ ఆడడం వ్యసనంగా మారింది. ఆన్ లైన్ రమ్మీ ఆడుతూ..అందులో డబ్బులు పెట్టేవాడు. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో…ఇతరుల దగ్గర అప్పు చేసేవాడు. ఇలా లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. జూదంలో పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం, అప్పు ఇచ్చిన వాళ్లు వత్తిడి తేవడంతో మానసికంగా కృంగిపోయాడు మోహన్.

ఈ నేపథ్యంలో ఆత్మహత్యే శరణ్యమని కుటుంబం భావించింది. దీనిలో భాగంగా శుక్రవారం తల్లి, భార్య, కొడుకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం మోహన్ సినీ పక్కీలో ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

click me!