
Union Minister Rajeev Chandrasekhar: ఎయిర్ బస్, బోయింగ్ నుంచి వందలాది విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు పలువురు చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న అభివృద్ది చూడలేక ఇలా విమర్శలు చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ఈ ఒప్పందాలపై వ్యంగ్యంగా విమర్శలు చేయడంపై మంత్రి స్పందిస్తూ ప్రతిపక్షాలు ఇలా అభివృద్దిని అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు.
శుక్రవారం ట్వీట్ లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. పలువురు లెఫ్ట్ నాయకులు చేసిన హాస్యాస్పద వ్యాంగ్యాస్త్రాలను పంచుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "భారతదేశంలో మంచి విషయాలు జరిగినప్పుడు, వామపక్షాలు ఇలా ప్రతిస్పందిస్తాయి" అని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్ డీల్ గురించి కొంతమంది వ్యక్తులు చేసే వ్యంగ్య వ్యాఖ్యలతో కూడిన ఒక ఫొటోను పంచుకున్న మరొక ట్విట్టర్ వినియోగదారు పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజీవ్ చంద్రశేఖర్ మరో ట్వీట్ లో స్పందిస్తూ.. "జీవితంలో ఎదగడానికి కృషి చేయాల్సిన వంశస్థులు, లక్ష్యాలు, ఆశయాలు, కృషిని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటారు. చైనా కంటే భారత్ వెనుకబడి ఉందంటే దానికి కారణం ఆమె తండ్రి, ఇతర రాజవంశాల దశాబ్దాల రాజకీయాలే.. అయితే, ప్రస్తుతం ప్రధాని వల్లే భారత్ తన ఆశయాలను క్రమంగా పెంచుకుంటోంది" అని అన్నారు.
కాగా, భారత విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే.. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎయిర్ బస్, బోయింగ్ 840 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది, ఇందులో 370 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో ఎయిర్ బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు, 370 ఆప్షన్లు, కొనుగోలు హక్కులు ఉంటాయని ఎయిరిండియా చీఫ్ కమర్షియల్ అండ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ తెలిపారు. దాదాపు రెండేళ్ల క్రితం ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియతో ప్రారంభమైన అద్భుతమైన ప్రయాణానికి ఈ మెగా ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ ప్రధాన్యత సంతరించిపెట్టింది.
ఆధునిక విమానయాన చరిత్రలో ఒక విమానయాన సంస్థ చేసిన అతిపెద్ద విమాన ఆర్డర్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఎయిర్ బస్ సంస్థ ఆర్డర్ లో 40 A350-900/1000, 210 A320/321 నియో/ఎక్స్ ఎల్ ఆర్ విమానాలు ఉన్నాయి. బోయింగ్ సంస్థ ఆర్డర్ లో 190 737-మ్యాక్స్, 20 787లు, 10 777 రకానికి చెందిన విమానాలు ఉన్నాయి. కాగా, 2022 జనవరిలో ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్ కొనుగోలు చేసిన ఎయిరిండియా విమానాలకు ఆర్డర్ ఇవ్వడం 17 ఏళ్లలో ఇదే తొలిసారి. తొలి ఏ350 విమానాన్ని ఈ ఏడాది చివరికల్లా ఎయిరిండియా అందుకోనుంది. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చాలన్న టాటా గ్రూప్ దార్శనికత, ఆకాంక్షను ఈ ఆర్డర్ చాటిందని, ఎయిరిండియా ప్రైవేటీకరణ వల్ల ఏర్పడిన అపారమైన ఆర్థిక సామర్థ్యానికి ఈ ఆర్డర్ నిదర్శనమని అగర్వాల్ అన్నారు.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటిగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. విమానాల తయారీ సంస్థ బోయింగ్ కొన్ని రోజుల క్రితం వార్షిక దేశీయ ఎయిర్ ట్రాఫిక్ వృద్ధి 2041 నాటికి దాదాపు 7 శాతం ఉంటుందని అంచనా వేసింది. రాబోయే రెండు దశాబ్దాలలో దేశానికి సుమారు 2,210 కొత్త విమానాలు అవసరమవుతాయని అంచనా వేసింది.