
మహారాష్ట్ర : ఆ మహిళ కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు. దీంతో ఆమె తన భర్త, సోదరుడితో కలిసి ఓ బాబాను ఆశ్రయించింది. మహిళ బలహీనతను ఆసరాగా చేసుకున్న దొంగ బాబా దారుణానికి పాల్పడ్డాడు. ఆ మహిళను భయపెట్టి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని పూణేకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ కుటుంబం కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సమస్యలతో అల్లాడుతుంది. ఆ మహిళ కొడుకు ఆరోగ్యం కూడా బాగోలేదు. దీంతో ఇరుగుపొరుగు వారి సలహా మేరకు ఆమె తన భర్త, సోదరుడితో కలిసి ఒక అరవై ఏళ్ల బాబా దగ్గరికి వెళ్ళింది. అతనితో తమ సమస్యలు చెప్పుకుంది. సమస్యలు తీరాలంటే ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని ఆ బాబా అన్నాడు. ఆ మహిళ దానికి అంగీకరించింది.
ఆ మహిళ భర్త, సోదరుడిని బయటనుంచి బాబా ఆమెను ఓ గదిలోకి తీసుకు వెళ్ళాడు. ఆమెను నగ్నంగా మారాల్సిందిగా ఆదేశించాడు. అందుకు ఆమె నిరాకరించింది. తాను చెప్పినట్లు వినకపోతే కుటుంబ సభ్యులు మొత్తం చనిపోతారని బెదిరించాడు. దీంతో ఆ మహిళ భయపడి బాబా చెప్పినట్లే చేసింది. ఆ తర్వాత ఆమెపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు వచ్చిన మహిళ తన సోదరుడికి మొత్తం విషయం చెప్పింది. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్టు చేశారు.
ఇలాంటి ఘటనే నిరుడు జూన్ లో ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. రహస్యంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఐదుగురిని వివాహం చేసుకోవడమే కాక వారికి విడాకులు ఇవ్వకుండానే ప్రస్తుతం మరో పెళ్లికి సిద్ధమైన దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలు… ఉత్తర ప్రదేశ్ షహనాజ్ పూర్ కు చెందిన అనూజ్ చేతన్ కథేరియా అనే వ్యక్తికి 2005లో మొదటిసారి వివాహం అయింది. పెళ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండడంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది.
ఇదిలా ఉండగానే 2010లో అనూజ్ రెండో వివాహం చేసుకున్నాడు. కొద్దికాలం తర్వాత ఆమె అనూజ్ వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి విడిపోయింది. నాలుగేళ్ల తర్వాత అనూజ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును 4వ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనూజ్ నిజస్వరూపం తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఈ క్రమంలో 2019లో అనూజ్ ఐదోసారి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్ నుంచి వేరుగా ఉంటుంది. కాగా, కొద్ది రోజుల క్రితం అనూజ్ ఆరవసారి పెళ్లికి సిద్ధమయ్యాడు ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్ ని అరెస్టు చేశారు.
దర్యాప్తులో అనూజ్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. లక్కీ పాండే గా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రస్ లు ఇస్తూ... మహిళలను మోసం చేసే వాడినని వెల్లడించాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్, టీచర్, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి, వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు. అలానే సమస్యలతో తన ఆశ్రమానికి వచ్చే మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకునే వాడినని పోలీసుల దర్యాప్తులో అనూజ్ వెల్లడించాడు.