
IPC, CrPC, Indian Evidence Act Replaced : ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లులలో 1. భారతీయ న్యాయ సంహిత-2023 (ఇది నేరాలకు సంబంధించిన నిబంధనలను ఏకీకృతం చేయడానికి, సవరించడానికి, వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించినది). 2. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023 (ఇది క్రిమినల్ ప్రొసీజర్‌కి సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడానికి, సవరించడానికి, దానికి సంబంధించిన అంశాలకు సంబంధంచినది). 3. భారతీయ సాక్ష్యా బిల్లు-2023 (న్యాయమైన విచారణ కోసం సాధారణ నియమాలు-సాక్ష్యాల సూత్రాలను ఏకీకృతం చేయడానికి సంబంధించినది). అయితే, ఈ బిల్లుల ఏర్పాటుపై అనేక మంది న్యాయ నిపుణులు స్వాగతిస్తున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం పార్లమెంటులో ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం స్థానంలో మూడు బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు, అనేక మంది న్యాయ నిపుణులు ప్రభుత్వ చర్యను స్వాగతించారు. మూడు శతాబ్దాల పురాతన ప్రధాన క్రిమినల్ చట్టాలకు సవరణలు అవసరం ఉన్నందున ఈ చట్టం దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజున బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో "శిక్షకు బదులు న్యాయం" అనే అంశంపై దృష్టి సారించడానికి ఉద్దేశించిన మూడు ముఖ్యమైన బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. భారతీయ నగరిక్ సురక్షా సంహిత 2023, భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ సక్ష్య బిల్లు 2023లను శుక్రవారం పార్లమెంటు దిగువ సభలో ప్రవేశపెట్టారు. బిల్లులను పరిశీలన కోసం స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.
దీనిపై కేంద్ర మాజీ న్యాయశాఖ కార్యదర్శి పీకే మల్హోత్రా స్పందిస్తూ.. ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ , సీఆర్ పీసీల స్థానంలో తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులు క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న, కోరుకున్న సంస్కరణ అని పేర్కొన్నారు. "బ్రిటీష్ కాలం నాటి ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, సీఆర్పీసీల స్థానంలో తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న, కోరుకున్న సంస్కరణ. ఇప్పటివరకు సంస్కరణలు చేసినప్పటికీ, లా కమిషన్ నివేదికలు, జస్టిస్ మలిమఠ్ కమిటీ నివేదికలతో సహా అనేక నివేదికలు ఉన్నప్పటికీ, సామాన్యులకు న్యాయం జరగడం లేదు. చిన్న చిన్న నేరాలకు విచారణ ఎదుర్కొంటున్న నిందితులు దీర్ఘకాలంగా అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో ఉన్నారని" ఆయన అన్నారు. చిన్న నేరాలకు కమ్యూనిటీ సర్వీస్, జస్టిస్ డెలివరీ సిస్టమ్ లో టెక్నాలజీ వినియోగం, తీవ్రమైన నేరాలకు శిక్షలను హేతుబద్ధీకరించడం వంటి విధానపరమైన మార్పులతో న్యాయ పంపిణీ మరింత వేగంగా, సంస్కరణాత్మకంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ చట్టాలను వందేళ్ల క్రితమే అమలు చేశామనీ, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని సీనియర్ న్యాయవాది వికాస్ పహ్వా అన్నారు. మూడు క్రిమినల్ మేజర్ చట్టాలు వందేళ్ల క్రితమే అమల్లోకి వచ్చాయనీ, వాటిని సవరించాల్సిన అవసరం ఉందన్నారు. "ఒక క్రిమినల్ న్యాయవాదిగా, విచారణ విధానం, శిక్షా నేరాల నిర్వచనాలు, సాక్ష్యాల చట్టం పురాతనమైనవి, సమూల మార్పులు అవసరం. ఆధునిక భారతదేశానికి అనుగుణంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ భావించాను. ఈ తరహాలో రూపొందించిన ఏ చట్టమైనా మన దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ బిల్లులు మన అత్యవసర న్యాయ అవసరాలను తీర్చగలిగితే, అవి దేశంలో విచారణలు నిర్వహించే విధానంలో గణనీయమైన పురోగతిని తెస్తాయి" అని వికాస్ పహ్వా అన్నారు.
ఈ మూడు బిల్లులు చారిత్రాత్మకమైనవని, ఇవి భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను బలోపేతం చేస్తాయని కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. "ఈ మూడు బిల్లులు చారిత్రాత్మకం. ఇవి భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. గతంలో ప్రజలు పరారీలో ఉండేవారనీ, ట్రయల్స్ జరిగేవి కావని... ఇకపై పారిపోయిన వారికి, ఉగ్రవాదులకు విడివిడిగా విచారణలు చేయాల్సి ఉంటుంది... శిక్ష తప్పదు" అని ఏఎన్ఐ వార్తాసంస్థతో అన్నారు. భారతీయ న్యాయ సంహిత 2023 అనేది IPC 1860ని భర్తీ చేయనుండగా, భారతీయ నాగ్రిక్ సురక్షా సంహిత 2023 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను భర్తీ చేస్తుంది. భారతీయ సాక్ష్యా బిల్లు 2023 భారతీయ సాక్ష్యాధారాల చట్టం, 1872 స్థానంలో తీసుకొస్తున్నారు. ఈ బిల్లులు శిక్షలు విధించడం కోసం కాదని, న్యాయం చేసేలా ఉన్నాయని హోం మంత్రి అన్నారు. విస్తృత సంప్రదింపుల అనంతరం బిల్లులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
రాజద్రోహాన్ని రద్దు చేయడం, మూకదాడులకు వ్యతిరేకంగా కొత్త శిక్షాస్మృతి, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష, చిన్న నేరాలకు శిక్షల్లో ఒకటిగా మొదటిసారి సమాజ సేవ చేయడం వంటివి ఈ చట్టంలోని కీలక నిబంధనలు. మహిళలు, పిల్లలపై నేరాలు, హత్యలు, రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉగ్రవాద చర్యలు, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కొత్త నేరాలను కఠినమైన శిక్షలతో బిల్లులో చేర్చారు. వేర్పాటు వాదం, సాయుధ తిరుగుబాటు, విద్రోహ కార్యకలాపాలు, వేర్పాటువాద కార్యకలాపాలు, భారత సార్వభౌమత్వానికి, ఐక్యతకు భంగం కలిగించడం వంటి నేరాలకు కఠిన శిక్షలు, ఎన్నికల సమయంలో ఓటర్లకు లంచం ఇస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు.