
తనకు ముస్లింల ఓట్లు అవసరం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కాంగ్రెస్ లాగా తాను ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడబోనని అన్నారు. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, వారి పిల్లలు విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని తాను అనుకుంటున్నానని తెలిపారు. ముస్లిం సమాజంలో బాల్య వివాహాలను అంతం చేయాలనుకుంటున్నట్టు అన్నారు. శుక్రవారం ఆయన ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రస్తుతం నాకు ముస్లిం ఓట్లు వద్దు. అన్ని సమస్యలు ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే జరుగుతున్నాయి. నెలకోసారి ముస్లిం ప్రాంతానికి వెళ్లి వారి కార్యక్రమాల్లో పాల్గొంటాను. ప్రజలను కలుస్తాను. కానీ రాజకీయాలను అభివృద్ధితో ముడిపెట్టను. కాంగ్రెస్ తో తమకున్న అనుబంధం ఓట్ల కోసమేనని ముస్లింలు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
‘‘నాకు ఓట్లు వేయొద్దు. వచ్చే పదేళ్లలో మీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను. బాల్య వివాహాల ఆచారాన్ని అంతమొందించాలని, మదర్సాలకు వెళ్లడం మానేయాలని కోరుతున్నాను. దానికి బదులు కాలేజీలకు వెళ్లాలి. ముస్లిం బాలికల కోసం ఏడు కళాశాలలను ప్రారంభించబోతున్నాను’’ అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
బీజేపీతో తమ సంబంధాలు ఓట్లకు అతీతమైనవని ముస్లింలు ఎందుకు అర్థం చేసుకోవాలో వివరిస్తూ.. ‘‘ముస్లిం ప్రాంతాల్లో కాంగ్రెస్ మౌలిక సదుపాయాలు లేదా పాఠశాలలను నిర్మించలేదు. కానీ నేను వాటిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. 10-15 ఏళ్లు ఇలాగే చేస్తాను, ఆ తర్వాత ముస్లింల ఓట్లు అడుగుతాను. ఇప్పుడు నేను వారి నుంచి ఓట్లు అడిగితే అది గివ్ అండ్ టేక్ రిలేషన్ గా మారుతుంది. ఇది లావాదేవీ సంబంధంగా ఉండాలని నేను కోరుకోవడం లేదు’’ అని తెలిపారు.
గత రాష్ట్ర ఎన్నికల్లోనూ తాను ముస్లిం ప్రాంతాల్లో ప్రచారం చేయలేదని శర్మ చెప్పారు. ‘‘2016, 2020లో ఎన్నికల ప్రచారంలో ముస్లిం ప్రాంతాలకు వెళ్లలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాతే వెళ్తానని చెప్పాను. ఈసారి కూడా నేను వారికి చెబుతున్నాను, మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. తమ ప్రాంతంలో బీజేపీ ప్రచారం చేయదు’’ అని శర్మ స్పష్టం చేశారు.
కాగా.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ 60 స్థానాలను కైవసం చేసుకుని వరుసగా రెండోసారి విజయం సాధించింది. అసోంలో బీజేపీ మిత్రపక్షాలైన ఏజీపీ, యూపీపీఎల్జేపీ వరుసగా 9, 6 సీట్లు గెలుకున్నాయి. వాటిని కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2015లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన శర్మ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు కారణమయ్యారు. ఆయన సర్బానంద సోనోవాల్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం రెండో సారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.