జనవరి నుంచి పిల్లలకు టీకా?.. బూస్టర్ డోసుపైనా రెండు వారాల్లో నిపుణుల సమావేశం

By telugu teamFirst Published Nov 22, 2021, 5:03 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం మరో రెండు మూడు వారాల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. టీకా పంపిణీపై నిర్ణయాలు తీసుకున్న కీలక కమిటీ మరో రెండు వారాల్లో సమావేశం కాబోతున్నది. ఈ సమావేశంలో చిన్నపిల్లలకు టీకా పంపిణీ, వయోజనులకు బూస్టర్ డోసు అందించడంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా, కోమార్బిడిటీస్ ఉన్న పిల్లలకు జనవరి నుంచి  టీకా అందించాలనే ఆలోచనలు జరుగుతున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. మార్చి నుంచి పిల్లలందరికీ టీకా పంపిణీ అందుబాటులోకి రావచ్చునని చెప్పాయి.
 

న్యూఢిల్లీ: మన దేశంలో చాలా వరకు వయోధికులు, వయోజనులు టీకా తీసుకున్నారు. గర్భిణులు, బాలింతలు సైతం టీకా తీసుకుంటున్నారు. పిల్లలకు మాత్రమే టీకా పంపిణీ జరగాల్సి ఉన్నది. కరోనా మహమ్మారి కాస్త వెనక్కి తగ్గిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకుంటుండటంతో పిల్లలకు టీకా పంపిణీపై చర్చ క్రమంగా పెరుగుతున్నది. ఈ అంశంపైనే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇన్ ఇండియా(ఎన్‌టీఏజీఐ) వచ్చే రెండు వారాల్లో సమావేశం కాబోతున్నది. అయితే, ఈ వర్గాల నుంచి కొన్ని కీలక విషయాలు తెలిశాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి దీర్ఘకాలిక వ్యాధులున్న పిల్లలకు టీకా పంపిణీ ప్రారంభించడానికి ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిసింది. అయితే, మార్చి నుంచి పిల్లలందరికీ టీకాను అందుబాటులోకి తేవాలనే నిర్ణయంపై చర్చించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, బూస్టర్ డోసుపైనా చర్చ జరగనున్నట్టు సమాచారం.

వచ్చే రెండు వారాల్లో ఎన్‌టీఏజీఐ నిపుణులు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే టీకా వేసుకున్న వయోజనులకు అదనపు డోసులు ఇచ్చే అంశానికి సంబంధించి ఈ భేటీలో చర్చించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై చర్చలు జరుగుతాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. కోమార్బిడిటీస్ ఉన్న పిల్లలకు జనవరిలో టీకా పంపిణీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని ఆ అధికారే తెలిపారు. అంతేకాదు, మార్చి కల్లా పిల్లలు అందరూ టీకాకు అర్హులు కావచ్చేనే అభిప్రాయాన్ని చెప్పారు.

Also Read: Covaxin For Kids : 2-18 యేళ్లలోపు పిల్లలకు కోవాగ్జిన్... !!

కరోనా మహమ్మారి వేగంగా వ్యాపించే సమర్థతను పెంచుకుంటున్న తరుణంలో అదనపు డోసుల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే చాలా దేశాలు ఈ బూస్టర్ డోసుపై చర్చలు చేస్తున్నాయి. రెండు డోసులు వేసుకున్న వారికి బూస్టర్ డోసు ఇవ్వాలనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మన దేశంలోనూ దీనిపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. అలాగే, పిల్లల పాఠశాలలు ప్రారంభమై ప్రత్యక్షంగా తరగతులకు హాజరు అవుతున్న తరుణంలో వారికీ టీకా అందజేయాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి.

Also Read: Booster Dose: రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 6 నెలలకు బూస్టర్ డోస్.. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ శనివారం మీడియాతో ఇవే అంశాలపై మాట్లాడారు. చిన్న పిల్లలకు కరోనా టీకా పంపిణీ, వయోజనులకు బూస్టర్ డోసు అందించడంపై ఆయన స్పందించారు. విదేశాల్లో చిన్న పిల్లలకు టీకా పంపిణీని జరుగుతున్న తీరును తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ పంపిణీ పురోగతినీ పరీక్షిస్తున్నామని చెప్పారు. ఒక్కో దేశం ఒక్కోలా టీకా పంపిణీ చేపడుతున్నదని వివరించారు. కొన్ని దేశాలు 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ చేస్తుండగా ఇంకొన్ని దేశాలు వేరే వయసు పరిమితులను తీసుకుంటున్నాయని తెలిపారు. అయితే, చిన్న పిల్లలకు టీకా పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అలాగే, బూస్టర్ డోసు పైనా మాట్లాడారు. తమ ముందును మొదటి లక్ష్యం అందరికీ టీకా అందించడమేనని అన్నారు. ఆ తర్వాత బూస్టర్ డోసు పై యోచిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 80 శాతం వయోజనులు కనీసం సింగిల్ డోసు తీసుకుని ఉన్నారని వివరించారు.

click me!