
ముంబై (mumbai police) మాజీ పోలీస్ కమీషనర్ పరంబీర్ సింగ్ (parambir singh) జాడ తెలిసింది. ఆయన ఛండీగడ్‌లో (chandigarh) వున్నట్లుగా జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ముంబై పోలీసులకు టార్గెట్ పెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర (maharashtra) మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (anil deshmukh) , ముంబై కమీషనర్‌గా వున్న పరంబీర్ సింగ్ కలిసి వసూళ్లకు పాల్పడినట్లు సచిన్ వాజే ఆరోపించారు. దాంతో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.
విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయగా.. ఆయన నాటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరంబీర్ సింగ్ దేశం విడిచి పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్ట్‌ను (supreme court) ఆశ్రయించారు పరంబీర్. దాంతో ఆయన ఎక్కడున్నారో ముందు చెప్పాలని పరంబీర్ సింగ్ తరపు లాయర్‌ను సుప్రీం ఆదేశించింది. ఆ తర్వాతే పిటిషన్‌పై విచారణ జరుపుతామని చెప్పింది. అయితే పరంబీర్ సింగ్ ఇండియాలోనే వున్నారని.. 48 గంటల్లో విచారణకు హాజరవుతారని కోర్టుకు తెలిపారు ఆయన తరపు న్యాయవాది.
ఇక అవినీతి కేసులో మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపిన సంగతి తెలిసిందే. ఇదే విచారణలో ఆయన చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తనకు ఇంటి వద్ద నుంచి ఆహారాన్ని పొందడానికి అనుమతించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ, కోర్టు ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ముందు జైలు ఫుడ్ తినాలని సూచించింది. ఒకవేళ దానితోని సమస్య ఉత్పన్నమైతే అప్పుడు ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని నవంబర్ 15న జరిగిన విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే, ఆయన ఆరోగ్య స్థితిని దృష్టిలో పెట్టుకుని జైలులో బెడ్ ఏర్పాటు చేయడానికి అనుమతించింది.
Also Read:‘ముందు జైలు కూడు తిను.. ఆ తర్వాత చూద్దాం’.. మాజీ హోం మంత్రి విజ్ఞప్తిపై న్యాయస్థానం
మనీలాండరింగ్ కేసులో (money laundering) ఈ నెల 2వ తేదీన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ముంబయిలోని ఈడీ కార్యాలయంలో ఆయనను విచారించిన తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో దేశ్‌ముఖ్‌పై సీబీఐ అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాతే ఈడీ ఈ కేసును తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది. మాజీ ముంబయి పోలీసు అధికారి పరంబీర్ సింగ్.. తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల తర్వాతే దేశ్‌ముఖ్‌పై కేసు నమోదైంది.
రాష్ట్ర హోం మంత్రిగా అనిల్ దేశ్‌ముఖ్ ఉన్నప్పుడు ఆయన తన పదవిని తప్పుగా ఉపయోగించారని ఈడీ కోర్టులో వాదించింది. రాష్ట్రంలోని బార్లు రెస్టారెంట్ల ద్వారా రూ. 4.7 కోట్ల వసూలు చేసినట్టు ఆరోపించింది. డిస్మిస్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే (sachin waze) ద్వారా ఈ వసూళ్లు చేశాడని తెలిపింది. కాగా, తనపై చేసిన ఆరోపణలు అన్నింటిని దేశ్‌ముఖ్ కొట్టి పారేశారు. చెడు మార్గం పట్టాడన్న ఆరోపణలున్న ఓ పోలీసు అధికారి బూటకపు వాంగ్మూలం ఆధారంగా తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.