
ఓ మాజీ మంత్రి ఆరో పెళ్లి చేసుకోవాలని ఆరాటపడ్డాడు. అయితే.. అతని మూడో భార్య అతనికి ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసి.. అతని పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి బషిర్ ఆరోసారి వివాహానికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న అతని మూడో భార్య నగ్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బషిర్ తో తనకు 2012లోనే వివాహమైందని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లాయక తనను భౌతికంగా, మానసికంగా హింసించినట్లు వివరించింది. మహిళలను హింసించడం అతనికి చాలా ఇష్టమంటూ ఆమె ఆరోపించింది. బషిర్ మరో వివాహం చేసుకుంటున్నట్లు తనకు గత నెల 23న సమాచారం అందిందని.. దీనిపై నిలదీయడంతో తనకు తీవ్రంగా హింసించడంతోపాటు ట్రిపుల్ తలాక్ రూపంలో విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు పంపించారని తెలిపింది.
ఆమె ఫిర్యాదు ఆధారంగా.. ఆ వివాహాన్ని అడ్డుకోవడంతోపాటు ముస్లిం మహిళా వివాహ చట్టం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ అతనిపై ఈ తరహా కేసు నమోదు కాగా.. 23 రోజుల పాటు జైల్లో గడిపాడు. బషిర్ గతంలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.