నంబి నారాయనన్ పై కుట్రలో కేరళ, గుజరాత్ మాజీ డిజిపిలు ... సిబిఐ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు

By Arun Kumar P  |  First Published Jul 10, 2024, 8:38 PM IST

సంచలనం సృష్టించిన ఇస్రో శాస్త్రవేత నంబి నారాయనన్ కేసులో సిబిఐ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ వ్యవహారంపై దాఖలుచేసిన చార్జ్ షీట్ లో కేరళ, గుజరాత్ రాష్ట్రాల మాజీ డిజిపిల పేర్లను ప్రస్తావించింది...


Nambi Narayanan : ఇండియన్ స్పెస్ ఏజన్సీ (ఇస్రో) రహస్యాలను శత్రు దేశాలకు అమ్మారంటూ భారత శాస్త్రవేత్త నంబి నారాయనన్ ను 1994 లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ గూఢచర్యం కేసులో ఆయన జీవితమే నాశనం అయ్యింది... శాస్త్రవేత్తగా ఎంతో ఉన్నతస్థానానికి చేరుకునే అవకాశమున్న ఆయన కెరీర్ అక్కడితోనే పూర్తయ్యింది. ఈ కేసులో నంబి నారాయనన్, ఆయన కుటుంబం ఎంత నరకం అనుభవించిందో 'రాకెట్రీ' అనే బాలీవుడ్ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు... ఈ సినిమాతోనే నంబి నారాయనన్ గురించి చాలామందికి తెలిసింది. 

అయితే 1994 ఇస్రో గూఢచర్యం కేసును సిబిఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంబంధించిన వివరాలతో సిబిఐ దాఖలుచేసిన చార్జ్ షీట్ లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు నంబి నారాయనన్ ను అరెస్ట్ చేసారని సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ మేరకు కేరళ మాజీ డిజిపి సిబి మాథ్యూవ్ తో పాటు మరికొందరి పేర్లను ఈ చార్జ్ షీట్ లో చేర్చింది. 

Latest Videos

undefined

సిబిఐ చార్జ్‌షీట్ ప్రకారం...  రిటైర్డ్ సిఐ ఎస్. విజయన్ ఎలాంటి ఆధారాలు లేకుండానే మాల్దీవులుకు చెందిన మహిళ మరియా రషీదాపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వంచియూర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదు చేసారు. అనంతరం ఆనాటి ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయనన్ కూడా దోషిగా పేర్కొంటూ అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారంలో కేరళ, గుజరాత్ మాజీ డిజిపిలు సిబి మాథ్యూవ్, ఆర్.బి. శ్రీకుమార్ తో పాటు మరో ముగ్గురు మాజీ పోలీసులపై చార్జ్ షీట్ దాఖలయ్యింది. 

''తమ విచారణలో ఈ కేసు చట్ట విరుద్దమని తేలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బాధితురాలు మరియా రషీదాను అరెస్ట్ చేసారు. అనంతరం ఆమెపై గూఢచర్యానికి పాల్పడినట్లుగా తప్పుడు కేసు పెట్టారు. అలాగే ఈమె విచారణ రిపోర్ట్ కూడా పోలీసులు సృష్టించిందే. ఈ వ్యవహారంలో రిటైర్డ్ పోలీసులు ఎస్ విజయన్, సిబి మాథ్యూవ్, కెకె జోశువా, ఆర్బి శ్రీకుమార్ మరియు  జయ ప్రకాశ్ ల ప్రమేయం వుంది'' అని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 

''మాల్దీవులు మహిళ రషీదాతో పాటు ఆమె స్నేహితురాలు ఫౌజియా హసన్, ఇస్రో శాస్త్రవేత్తలు నంబి నారాయనన్, డి.శశికుమారన్ లతో పాటు చంద్రశేఖర్, ఎస్.కే శర్మలపై కేసులు నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల చట్టంతో పాటు దేశ రహస్యాలను బయటపెట్టారనే కుట్ర కేసులు వీరిపై నమోదయ్యాయి... ఇలా వీరిపై తప్పుడు కేసులు నమోదు చేసారు. వీరిపై ఆరోపణలు చేసిన అధికారులే తప్పుడు పత్రాలను సృష్టించారు...కుట్రపూరితంగా అరెస్ట్ చేసారు. ఇలా చట్టవిరుద్దంగా అరెస్ట్ చేసి టార్చర్ చేసారు'' అని సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొంది. 

''సిఐ విజయన్ మరియా రషీదాపై హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇందుకు ఆమె అంగీకరించకుండా ఎదిరించడంతో అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీంతో రషీదాపై కోపం పెంచుకున్న అతడు ఆమె గురించి ఆరాతీసాడు. ఈ క్రమంలోనే రషీదాకు ఇస్రో శాస్త్రవేత్త శశికుమారన్ తో సంబంధమున్నట్లు తెలిసింది. దీంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత రహస్యాల కోసమే ఆమె ఇక్కడికి వచ్చినట్లు కేసు పెట్టాడు. అనంతరం  ఇస్రో శాస్త్రవేత్తలు నంబి నారాయనన్, శశికుమారన్ తో పాటు రషీదా, ఆమె స్నేహితురాలు ఫౌజియాను అరెస్ట్ చేసారు'' అని ఇస్రో గూఢచర్యం కేసుపై దాఖలుచేసిన చార్జ్ షీట్ లో సిబిఐ పేర్కొంది. 

click me!