ద్వేషపూరిత ప్రసంగాలను ఖండించడం సెలక్టివ్‌గా ఉండకూడదు.. 32 మంది మాజీ ఐఎఫ్‌ఎస్‌ల బహిరంగ లేఖ

By Sumanth KanukulaFirst Published Jan 5, 2022, 3:22 PM IST
Highlights

హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో విద్వేష పూరిత ప్రసంగాలపై (Haridwar hate speech) చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సెలక్టివ్‌గా ఖండనలు చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన 32 మంది మాజీ అధికారులు (ex-IFS officials) బహిరంగ లేఖ రాశారు. 

హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌లో విద్వేష పూరిత ప్రసంగాలను (Haridwar hate speech) ఇప్పటికే పలువురు ఖండించిన సంగతి తెలిసిందే. దేశంలో విద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయని పలువురు మాజీ సైనికాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటువంటి విద్వేషపూరిత ప్రసంగాలపై చర్య తీసుకోవాలని వారు కోరారు. అయితే తాజాగా సెలక్టివ్‌గా ఖండనలు చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన 32 మంది మాజీ అధికారులు (ex-IFS officials) బహిరంగ లేఖ రాశారు. దేశం, మోదీ ప్రభుత్వాన్ని కించపరిచేందుకు కొందరు హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు.

ఏ వర్గంపై జరిగే దాడినైనా మత, జాతి, సైద్ధాంతిక, ప్రాంతీయ మూలాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఖండించాలని వారు లేఖలో కోరారు. అయితే ప్రతి దానికి ప్రభుత్వంపై నిందలు వేయడం సరైనది కాదని పేర్కొన్నారు. ఈ లేఖ రాసిన వారిలో మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్, మజీ రాయబారి వీణా సిక్రి, లక్ష్మీ పూరి కూడా ఉన్నారు.

‘మావోయిస్టుల పట్ల సానుభూతి ఉన్న వామపక్షవాదులు అని పిలువబడే అనేక మంది కార్యకర్తల, కొంతమంది మాజీ సివిల్ సర్వెంట్స్,  కెరీర్‌లో అత్యున్నత స్థానాల్లో ఉన్న సాయుధ దళాల ఉన్నతాధికారులు, అలాగే మీడియాలోని కొన్ని విభాగాలు కలిసి..  దేశంలోని లౌకిక ధర్మాన్ని ఉల్లంఘించినట్లు భావించి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నిరంతర దుష్ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి’ అని వారు ఆరోపించారు. 

అయితే ప్రభుత్వంపై ఈ దాడులన్నీ పూర్తిగా ఏకపక్షంగా, వక్రమైనవి ఉన్నాయని వారు లేఖలో ఆక్షేపించారు. దేశంలో ఎక్కడైనా హిందూ అనే పేరు వాడే ఏ వర్గం చేసిన ప్రకటనకు సంబంధించి అయినా.. ప్రభుత్వాన్ని నిందించాలని చూస్తున్నారని చెప్పారు. హరిద్వార్ ఘటనను భారతీయులందరికీ ప్రమాదంగా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయపడ్డారు. ద్వేషపూరిత ప్రసంగాన్ని ఖండించడమనేది యూనివర్సల్‌గా ఉండాలని.. సెలక్టివ్‌గా ఉండకూడదని వారు లేఖలో తెలిపారు.  

ఇక, హరిద్వార్‌ విద్వేష ప్రసంగాలకు సంబంధించి యతి నర్సింగానంద్ సహా మరో 10 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం సాధువు యతి నర్సింగారావు ఒక్కరి మీదే కేసు నమోదు చేయగా.. తాజాగా మరికొంత సమాచారం తీసుకన్న తర్వాత మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు.

click me!