
కర్ణాటక రాజధాని బెంగళూరులో డబుల్ మర్డర్ సంచలనం సృష్టించింది. ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌లను ఆ సంస్థ మాజీ ఉద్యోగి అతి దారుణంగా హత్య చేశాడు. మరికొందరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివరాలు.. బెంగళూరు అమృతహళ్లిలోని పంపా ఎక్స్‌టెన్షన్‌లో రోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినుకుమార్, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రమణ్యలపై ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఫెలిక్స్‌తో సహా ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వారు కొడవలి, కత్తితో సహా పలు ఆయుధాలతో దాడికి దిగారు.
అయితే తీవ్రంగా గాయపడిన ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్‌లను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. వారి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫెలిక్స్ ఆఫీసులోకి చొరబడి కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ‘‘ఫెలిక్స్ గతంలో ఏరోనిక్స్‌లో పని చేసేవాడు. కానీ తన సొంత కంపెనీని స్థాపించడానికి నిష్క్రమించాడు’’ ఈశాన్య బెంగళూరు డీసీపీ లక్ష్మీప్రసాద్ తెలిపారు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. అయితే ఫెలిక్స్‌కు ఇలాంటి వ్యాపారం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఫణీంద్రతో పాటు ముగ్గురు నిందితులు ఉత్తర బెంగళూరులోని అమృతహళ్లిలోని కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఆఫీసు ఆవరణలో మరో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ఫణీంద్ర తన గదిలో కూర్చొని ఉండగా ముగ్గురు నిందితులు ఒక్కసారిగా పదునైన ఆయుధాలతో దాడి చేశారు. వినుకుమార్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా దాడి చేశారు. అనంతరం నిందితులు బ్యాక్‌డోర్‌లో నుంచి తప్పించుకున్నారు.